నీవు ఫలానా సామాజిక వర్గంలోని మెజారిటీ ఓట్లు మన పార్టీకే వచ్చేలా చర్యలు తీసుకోవాలి..
ఎన్నికల్లో ప్రచారం చేయడం సర్వసాధారణం. అయితే పోలింగ్ రోజు నాటికి చేసే పోల్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ అతి ముఖ్యమైనది. కొంత మంది నాయకులు ఈ ప్రక్రియలో ఆరితేరి ఉంటారు. ప్రచారంలో కొంత వెనకబడి ఉన్నప్పటికీ ‘ఓట్ల నిర్వహణ’ ప్రక్రియ ద్వారా వారి విజయాలకు బాటలు వేసుకుంటారు. ఇప్పటికే జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచారం తార స్థాయికి చేరింది. ఒక వైపు ప్రచారం సాగిస్తూనే ముఖ్య నాయకులు, నమ్మినబంటులకు పోల్ మేనేజ్‌మెంట్ పనిని అప్పగిస్తున్నారు. దీంతో వారు బూత్ స్థాయి కమిటీలతో, ముఖ్య కార్యకర్తలతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఏ వర్గాల వారికి ఎక్కువగా ఓట్లు ఉన్నాయో గుర్తించి, వారితో చర్చలు జరిపి తమ పార్టీకి ఓట్లు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓట్ల పండగకు ఇంకా ఆరు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో వారికి తోచిన విధంగా ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సాక్షి, మెదక్ :ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తూనే మరోవైపు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తున్నారు. ఆయా పార్టీల పోలింగ్ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే అభ్యర్థులు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ వంద మంది ఓటర్ల బాధ్యతను బూత్‌కమిటీ సభ్యులకు అప్పగిస్తున్నారు. వారితో తమ పార్టీకే ఓటు వేయించే బాధ్యతను ముఖ్య నాయకులతోపాటు బూత్ కన్వీనర్, కమిటీ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పట్టణాలు, పల్లెల్లో రాజకీయవేడి పెరుగుతోంది.
గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో ప్రభావితం చూపే సామాజికవర్గాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా నియోకజవర్గాల్లో మహిళా ఓటర్లు, బీసీ ఓటర్లు కీలకం. బీసీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపితే ఆపార్టీకి ఎన్నికల్లో విజయావకాశాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు బీసీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగా బీసీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అలాగే మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తాయిలాలను ప్రకటిస్తున్నారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం..
మెదక్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీలోని ముగ్గురు అభ్యర్థులు రోజురోజుకు ప్రచార వేగాన్ని పెంచుతున్నారు. చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం చేస్తూనే మరోవైపు పోల్‌మేనేజ్‌మెంట్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. శుక్రవారం పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు టీఆర్‌ఎస్ ముఖ్యనాయకులు, మండల అధ్యక్షులు, బూత్‌ఇన్‌చార్జిల సమావేశంలో ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పోలింగ్ బూత్ కమిటీలకు ప్రచార సామగ్రి, ఓటరు జాబితాను ఇప్పటికే అందజేశారు. అనంతరం గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి కూడా ప్రచారంలో జోరును పెంచారు. ఒకవైపు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తునే అధిక ఓట్లున్న సామాజిక వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆ పార్టీ పోల్‌మేనేజ్‌మెంట్ బాధ్యతను తన సోదరుడు శశిధర్‌రెడ్డితోపాటు నియోజకవర్గ ముఖ్యనేతలకు అప్పగించారు. శశిధర్‌రెడ్డి నియోకజవర్గ నాయకులు, బూత్ ఇన్‌చార్జిలతో వరసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ బూత్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల రాజయ్య నియోకజవర్గంలోని శక్తి కేంద్రాల సభ్యులతో ఇప్పటికే సమావేశమై ఇన్‌చార్జిలకు పోలింగ్ బాధ్యతలను అప్పగించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సైతం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డి ముమ్మర ప్రచారంగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలను ముఖ్యనాయకులకు అప్పగించారు. బూత్‌స్థాయి నాయకులతో సమావేశమై గెలుపుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. సునీతారెడ్డి పోలింగ్ రోజున ఓటర్లు కాంగ్రెస్‌కు అండగా నిలిచేలా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను మరింత ఆకట్టుకునేందుకు త్వరలో నర్సాపూర్‌లో భారీ బహరింగ సభను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment