హైదరాబాద్: ఇటీవలి ఉపఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయ ఆలోచనా సరళిని ప్రస్ఫుటం చేశాయని, టీఆర్‌ఎస్ బలోపేతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఎంల నుంచి పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, కౌన్సిలర్లు శుక్రవారం సీఎం క్యాంపు ఆఫీస్ లో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల నీటి అవసరాల కోసం మున్నేరు వాగుపై కనీసం చెక్‌డ్యాం కూడా కట్టనివ్వకుండా ఆంధ్రా పాలకులు కట్టడి చేశారన్నారు. ఖమ్మం జిల్లాను ఆనుకుని పారే గోదావరి జలాలనూ వాడుకోనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలను అవసరమైతే కృష్ణా ఆయకట్టుకూ వాడుకునేలా సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం) వరదాయినిగా నిలవనుందన్నారు.