నల్లగొండలో జరిగే సమావేశ ఏర్పాట్లను పరిశీలిస్తున్న బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాపై తన పట్టు నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ వ్యూ హాలకు కాంగ్రెస్ నాయకత్వం ప్రతి వ్యూహాలు రచిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్వపు జిల్లాలో ఆ పార్టీ ఐదు స్థానాలను గెలుచుకోవడంతోపాటు తమ మిత్రపక్షంగా ఉన్న సీపీఐ దేవరకొండలో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని పన్నెండు స్థానాల్లో సగం గెలుచుకున్నట్లయ్యింది. దీంతోపాటు నల్లగొండ పార్లమెంటు స్థానాన్ని సైతం సొంతం చేసుకుంది.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోమిర్యాలగూడ(కాంగ్రెస్), దేవరకొండ (సీపీఐ) ఎమ్మెల్యేలు, నల్లగొండ ఎంపీ గుత్తా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకో వడంతో టీఆర్‌ఎస్ బలం పుంజుకుంది. ఈసారి ఎన్నికల్లో జిల్లాపై పట్టు నిరూపించుకునేందుకు టీఆర్‌ఎస్ అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో తమ పట్టు చేజారకుండా, నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రతివ్యూహంతో ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీఆర్‌ఎస్ నాయకత్వం కార్యక్రమాలను విస్తృతం చేసింది. మరోవైపు ఆయా నాయకుల ముఖ్య అనుచరులు అనుకున్న వారిని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తమవైపు లాగేసుకుంది. తద్వారా మానసికంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది.
ముఖ్యనేతల స్థానాలే టార్గెట్
ప్రధానంగా జిల్లాలో కాంగ్రెస్ ముఖ్యుల స్థానాలను టార్గెట్ చేస్తూ టీఆర్‌ఎస్ కార్యక్రమాలు రూపొందిస్తోంది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా ఈ నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వపరిధిలోని ఈ నియోజకవర్గ టెయిల్ ఎండ్ భూములకు సాగునీరు అందించడంపై శ్రద్ధ చూపడం, ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని మున్సిపాలిటీగా మార్చడానికి కృషి చేయడం తదితర కార్యక్రమాలతో టీఆర్‌ఎస్ ఊపు పెరిగింది. దీంతో మునుపెన్నడూ లేని రీతిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత జానారెడ్డి నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు.
యువతను సమీకరించి మండలాల వారీగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నాయకులను తిరిగి ఆహ్వానిస్తున్నారు. సీఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండపైనా టీఆర్‌ఎస్ ఎక్కువగా దృష్టి పెడుతోంది. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పజెప్పింది. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.నూరు కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అభివృద్ధి పనుల ద్వారానే పట్టణ ప్రజలను దగ్గర చేసుకునే పనిలో పడింది. కాగా, దీనికి విరుగుడుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించడానికి ఏ చిన్న అవకాశం లభించినా వదులుకోవడం లేదు. ఆయన కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లాను చుట్టివస్తున్నారు. కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపే పనిలో పడ్డారు. టీఆర్‌ఎస్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పావులు కదుపుతున్నారు.
పార్టీ బలోపేతంపై దృష్టి
కాంగ్రెస్‌ను జిల్లాలో మరింత బలోపేతం చేయడంపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే ఆదివారం జిల్లా కేంద్రంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాల్లో పార్టీకి నాయకత్వ లేమి ఉంది. దీనికి అధిగమించేందుకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేసుకోవడంపై చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న వారిని, తమను వీడి ఆ పార్టీలోకి వెళ్లి అక్కడ కుదురుకోలేక పోతున్నవారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధిపొందొచ్చన్న వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఏఐసీసీ నాయకత్వం, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్ననున్న ఈ సమావేశం కీలకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment