సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన రెండోరోజు సోమవారం 100 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సోమవారం దాఖలైన 25కు తోడు ఇప్పటివరకు మొత్తం 130కి పైగా దరఖాస్తులు వచ్చినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. రిజర్వుడు నియోజకవర్గాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూలు, వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పోటీకి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ కోసం ఒక్కో స్థానం నుంచి 10 మందికి పైగా ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీటితోపాటు భువనగిరి, నల్లగొండ, మహబూబ్‌నగర్ స్థానాలకు కూడా దరఖాస్తులు బాగానే వస్తున్నాయి. నాగర్‌కర్నూల్ నుంచి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య దరఖాస్తు చేసుకున్నారు.
ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ (నాగర్‌కర్నూలు), వంశీచంద్‌రెడ్డి (మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి), అద్దంకి దయాకర్ (పెద్దపల్లి), చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (భువనగిరి), గోపగాని వెంకటనారాయణగౌడ్ (నల్లగొండ), శంకర్రావు, బొల్లు కిషన్ (నాగర్‌కర్నూల్), ఇందిరాశోభన్ (సికింద్రాబాద్), కోటూరి మానవతారాయ్ (వరంగల్, నాగర్‌కర్నూల్), శ్రీరంగం సత్యం (మల్కాజ్‌గిరి), ప్రొఫెసర్ భట్టు రమేశ్‌నాయక్ (మహబూబాబాద్), మన్నె క్రిశాంక్ (పెద్దపల్లి) తదితరులు మంగళవారం దరఖాస్తులిచ్చిన వారిలో ఉన్నారు. పెద్దపల్లి సీటును స్థానికుడైన ఉట్ల వరప్రసాద్‌కు ఇవ్వాలని కోరుతూ ఆయన అనుచరులు గాంధీభవన్‌లో ధర్నా నిర్వహించారు. ఇక మంగళవారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment