సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ టికెట్ల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువైంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా, ఏకంగా 380 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాష్ట్రస్థాయి నేతల నుంచి కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా ఉండటం గమనార్హం. ముఖ్యంగా నాలుగు రిజర్వుడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
వీటితో పాటు హైదరాబాద్, భువనగిరి, నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి స్థానాలకు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులొచ్చాయి. ఇక, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీకి ఒకే ఒక్క నాయకుడు ముందుకు రాగా, ఈసారి లోక్‌సభ బరిలో కచ్చి తంగా ఉంటారని భావిస్తోన్న కీలక నేతలెవరూ పీసీసీకి తమ దరఖాస్తులివ్వలేదు. మహబూబాబాద్, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన మహబూబాబాద్ నుంచి పోటీకి మొత్తం 44 దరఖాస్తులొచ్చా యి. ఇక జనరల్ స్థానాల విష యానికొస్తే హైదరాబాద్ తర్వాత భువనగిరి టికెట్‌కు ఎక్కువ దరఖాస్తులొచ్చాయి.
దరఖాస్తు చేసుకోని వారు
కాగా, లోక్‌సభ బరిలో ఉంటారని భావిస్తున్న పార్టీ సీనియర్ నేతలెవరూ టికెట్ల కోసం పార్టీకి దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. పొన్నాల లక్ష్మయ్య (భువనగిరి), రేణుకా చౌదరి (ఖమ్మం), జైపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), అజారుద్దీన్ (హైదరాబాద్), మధుయాష్కీ (నిజామాబాద్), రేవంత్‌రెడ్డి, డి.కె. అరుణ (మహబూబ్‌నగర్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్) పీసీసీకి తమ దరఖాస్తులు ఇవ్వలేదు. ఇక, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒకే ఒక్క దరఖాస్తు వచ్చింది. ఇటీవలే పార్టీలో చేరిన నెల్లోళ్ల రవీందర్ ఒక్కరే టికెట్ అడగడం గమనార్హం.
నియోజకవర్గాల వారీగా దరఖాస్తులివి
మహబూబాబాద్ (44), హైదరాబాద్ (39), నాగర్‌కర్నూలు (36), వరంగల్ (35), పెద్దపల్లి (31), భువనగిరి (29), మల్కాజ్‌గిరి (27), జహీరాబాద్ (23), నల్లగొండ (21), మెదక్ (21), ఖమ్మం (17), సికింద్రాబాద్ (16), ఆది లాబాద్ (12), కరీంనగర్ (11), మహబూబ్‌నగర్ (11), చేవెళ్ల (06), నిజామాబాద్ (1).
Comments
Please login to add a commentAdd a comment