గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో విపక్షాల విమర్శ
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం శాసనమండలిలో చర్చ ప్రారంభమైంది. తీర్మానాన్ని అధికార టీఆర్‌ఎస్ సభ్యుడు పాటూరి సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించగా... కె.స్వామిగౌడ్ బలపరిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పకపోవడం దురదృష్టకర మన్నారు. ‘టీఎస్’ అంటే ‘తెలంగాణ సోనియా’గా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు రుణ మాఫీకి సంబంధించి కాలపరిమితి చెప్పలేదనీ.. ఎంతమందికి వర్తింపచేస్తారో కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇవ్వాలని, వారిని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఫిర్యాదు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక నుంచి సెటిలర్లు అన్న పదం వాడొద్దనీ.. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవాలని సూచించా రు.
టీడీపీ సభ్యుడు బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం దశాదిశ లేకుండా ఉందన్నారు. నవ తెలంగాణ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సూచించారు. వివిధ రంగాలు ఎలా ఉండాలో సలహాలు తీసుకునేందుకు ప్రత్యేకంగా సభను ఒక రోజు సమావేశపరచాలన్నారు. గవర్నర్ ప్రసంగం చాలా బాగుందని టీఆర్‌ఎస్ సభ్యుడు పాటూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న మండలి ప్రతిపక్ష నాయకుడు డి.శ్రీనివాస్, గవర్నర్ ప్రసంగం ఏదో కర పత్రాలు పంచినట్లు ఉందని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై మాట్లాడాల్సిందిగా డీఎస్‌ను మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు కోరగా తాను శుక్రవారం మాట్లాడుతానని బదులిచ్చారు.
12 శాతం రిజర్వేషన్లు కల్పించండి: పాటూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతుండగా రిజర్వేషన్ల అంశం ప్రస్తావన కొచ్చింది. మధ్యలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు షబ్బీర్‌అలీ జోక్యం చేసుకుంటూ, ఈ నెల 29 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నం దున రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలుకు తాము మద్దతు ఇస్తామని డి.శ్రీనివాస్ చెప్పారు. కాగా, రిజర్వేషన్ల విషయంపై కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లను ఇప్పటికీ ఎన్నుకోలేదని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ సభ్యుడు యాదవరెడ్డి కోరారు. ఇప్పటివరకు ప్రమాణం చేయని టీడీపీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సభ్యుడు ప్రభాకర్‌లతో చైర్మన్ ప్రమాణం చేయించారు.