కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో పొత్తుకు సిద్ధం
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారామయ్య
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం స్థానిక షాదీఖానాలో నిర్వహించిన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ కాంగ్రెసేతరా పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర నాయకత్వం సూచించిందన్నారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర వహించినందున ఆ పార్టీని దూరం చేయలేమని రాష్ట్ర నాయకత్వం భావించిందని తెలిపారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పొత్తుకు చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నట్లు చెప్పారు. తొలుత పురపాలక సంఘం ఎన్నికల్లో మంచిర్యాలలో 1, బెల్లంపల్లిలో 8, ఆదిలాబాద్‌లో 3 సీట్లు ఖరారు కాగా నిర్మల్‌లో రెండు స్థానాలపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తుల విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతాయన్నారు.
అనంతరం కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పార్టీ పురోగతి, భవిష్యత్ ప్రణాళిక, ఎన్నికల్లో అనుసరించవల్సిన వ్యూహాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కత్తెరశాల పోశం, విలాస్, ఏవైఎఫ్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవేణి కుమారస్వామి, నాయకులు, వీరభద్రయ్య, మల్లారెడ్డి, నగేశ్, శఫీ, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.