సాక్షి, మెదక్: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడి ఎన్నికపై పార్టీలో ప్రతిష్టంభన నెలకొంది. డీసీసీ ఎన్నిక విషయంలో ముఖ్య నేతల మధ్య సయోధ్య కుదరకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా నేతలంతా ఒకే పేరు సూచించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పడికే తెలియజేసింది. కానీ ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లను సూచించినట్లు సమాచారం. దీంతో జిల్లా అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా అధ్యక్షుల జాబితాను అందజేసినట్లు తెలుస్తోంది.
రాహుల్‌గాంధీ ఆమెదముద్ర వేసిన వెంటనే రెండు మూడు రోజుల్లో డీసీసీ పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి సునీతారెడ్డి ప్రస్తుతం పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జిల్లాల పునర్విభజనతో కొత్తగా మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే పీసీసీనిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలో బీజీ కారణంగా డీసీసీ నియామకం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం కొత్త జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మెదక్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుని నియామకం దిశగా కసరత్తు జరుగుతోంది.
త్వరలో ప్రకటన..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డి, చంద్రపాల్, బీసీ నేత మామిళ్ల ఆంజనేయులు, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన రెడ్డిపల్లి ఆంజనేయులు పోటీ పడుతున్నారు. వీరితోపాటు ఇటీవల మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేసిన ఉపేందర్‌రెడ్డి పేరు కూడా ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. ఈ ఐదుగురు పేర్లను పీసీసీకి పంపటం జరిగింది. ఐదుగురిలో ఉపేందర్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజకవర్గంలోనే పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నిక విషయంలో మాత్రం జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరటంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి సునీతారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరుపతిరెడ్డికి ఇవ్వాలని సూచిస్తున్నట్లు సమాచారం.
ఒక వేళ బీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న పక్షంలో తన అనుచరుడు రెడ్డిపల్లి ఆంజనేయులుకు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డిలు మెదక్ మాజీ జెడ్పీటీసీగా పనిచేసిన మామిళ్ల ఆంజనేయులుకు డీసీసీ అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సైతం మామిళ్ల ఆంజనేయులుకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. జిల్లా నాయకుడు చంద్రపాల్ కోసం పీసీసీ నేత మరొకరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నేతలు ఒక్కొక్కరు ఒక్కోపేరు సూచిస్తుండటంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తిరుపతిరెడ్డి లేదా మామిళ్ల ఆంజనేయులు ఎవరికో ఒకరికి డీసీసీ పీఠం దక్కే అవకాశం కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment