కారెక్కనున్న కాంగ్రెస్‌ మాజీ మంత్రి | Congress Leader Jalagam Prasada Rao Join In TRS Khammam | Sakshi
Sakshi News home page

కారెక్కనున్న కాంగ్రెస్‌ మాజీ మంత్రి

Published Fri, Nov 2 2018 7:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Leader Jalagam Prasada Rao Join In TRS Khammam - Sakshi

మాట్లాడుతున్న మాజీ మంత్రి జలగం ప్రసాదరావు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి. ఇప్పుడు బహిష్కృత నేత. నిన్నటి వరకు కాంగ్రెస్‌ మళ్లీ తనను సాదరంగా ఆహ్వానిస్తుందని ఎదురుచూశారు. పార్టీ తాత్సారం చేయడం.. ఇంతలోనే కారెక్కేందుకు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరగడం.. అనుచరులతో సమావేశం జరపడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్‌ నుంచి తన చేరికకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నట్లు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే అనూహ్య రీతిలో జలగం ప్రసాదరావుకు టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆహ్వానం అందడం, సాక్షాత్తూ మంత్రి కేటీఆర్‌.. ప్రసాదరావుతో భేటీ కావడం, ఇందులో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కీలక భూమిక పోషించారనే ప్రచారం జరుగుతోంది.

ఈ తరుణంలోనే జలగం ప్రసాదరావు హుటాహుటిన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని తన నివాస గృహానికి చేరడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయింది. గురువారం జిల్లాలోని జలగం ప్రసాదరావు రాజకీయ శిబిరంలో సైతం మెరుపు వేగంతో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రసాదరావు కుప్పెనకుంట్లకు వచ్చినట్లు తన అనుచరులకు సమాచారం ఇవ్వడంతో గురువారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆయన అనుచరులు, వివిధ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు జలగంతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్, సత్తుపల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవి.. జలగం ప్రసాదరావుతో కుప్పెనకుంట్లలోని ఆయన నివాసంలో భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

సాధారణంగా రాజకీయ అంశాలపై ఆచితూచి స్పందించి.. ఎప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేసి తన అంతరంగాన్ని తెలియకుండా రాజకీయ చతురత ప్రదర్శించే ప్రసాదరావు.. గురువారం జరిగిన తన అనుచర వర్గం భేటీలో, మీడియా సమావేశంలోనూ పలు అంశాలపై విస్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులు, టీఆర్‌ఎస్‌ నుంచి అందిన ఆహ్వానాన్ని ఆయన అనుచరులకు వివరించారు. కాంగ్రెస్‌లో చేరడం కోసం ఇప్పటివరకు నిరీక్షించిన ప్రసాదరావుకు చేరికపై అధిష్టానం ఇదిగో.. అదిగో అంటూ వాయిదా వేయడంతో ఆయన వర్గీయుల్లో నెలకొన్న అసహనం సైతం ఆయన టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపేందుకు పురిగొల్పిందన్న వాదన ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.
 
సంప్రదింపుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. 
జలగం ప్రసాదరావును కాంగ్రెస్‌లోకి తిరిగి తీసుకునేందుకు మూడు నెలల క్రితం సమావేశమైన పీసీసీ సంప్రదింపుల కమిటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.. అయితే జిల్లా కాంగ్రెస్‌ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. ఆ సమావేశంలో ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జిల్లా కాంగ్రెస్‌ నేతల అభిప్రాయం ఏమిటో? ఆయనను చేర్చుకుంటున్నారో? లేదో? కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం, పార్టీలో కొందరు నేతలు తన చేరికకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని భావించిన ప్రసాదరావు కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించారు.

పార్టీ నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడం.. ఆయన అనుచర వర్గం నుంచి రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి వస్తున్న తరు ణంలో టీఆర్‌ఎస్‌ సంప్రదించడంతో కేటీఆర్‌ తనను పార్టీలో చేరాల్సిందిగా కోరిన అంశాన్ని తన అనుచరులు, అభిమానులతో చర్చించారు. మెజార్టీ అనుచరు ల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని, తన కు కొంత సమయం కావాలని కేటీఆర్‌కు చెప్పినట్లు తన తో సమావేశమైన అనుచరులకు ప్రసాదరావు వివరించారు. రానున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అందులో మీకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రసాదరావుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుందని అప్పుడే ఆయన వర్గీయులు అంచనాలు వేస్తుండడం విశేషం.

మనోభావాలు తెలుసుకునేందుకే.. 
కాంగ్రెస్‌లో తన బహిష్కరణను రద్దు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా.. జిల్లా నేతలు అడ్డుగా మారారని, ఈసారికి తనకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారని, దీంతో రాజకీయంగా తన అవసరం ఉందని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అభిప్రాయంపై కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రసాదరావు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటే జిల్లాలో రాజకీయంగా పలు పరిణామాలు సంభవించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన అనుచరులు అనేక మంది కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని, ప్రసాదరావు రాజకీయ నిర్ణ యాన్ని ప్రకటిస్తే వారందరూ ఆయన రాజకీయ అడుగులో అడుగు వేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తు న్నాయి. జిల్లాలో టీఆర్‌ఎస్‌కు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగుతున్న నేతలను ఓడించేందుకు జలగం రాజకీయ వ్యూహాలు తమకు ఉపయోగపడతాయని టీఆర్‌ఎస్‌ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.

1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో పని చేశారన్న కారణంతో ప్రసాదరావుపై కాంగ్రెస్‌ అధిష్టానం ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. వాస్తవానికి ఆ గడువు 2005లోనే తీరినా.. జలగం కాంగ్రెస్‌లో చేరడానికి పెద్దగా సుముఖత చూపకపోవడం.. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. æఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జలగం తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు కాంగ్రెస్‌ సంప్రదింపుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా.. ఆయన మినహా ఆ కమిటీ ఓకే చేసిన వారందరూ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరడం విశేషం. ఈ పరిణామాలతో ఖిన్నుడైన జలగం ఇక కాంగ్రెస్‌ వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రసాదరావు 1983లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిన్నతరహా పరిశ్రమలు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై సత్తుపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. జలగం కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో ఆయన పార్టీలో చేరి పాలేరు నుంచి పోటీ చేస్తారని, మంత్రి తుమ్మలకు దీటైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రసాదరావుకు జిల్లావ్యాప్తంగా అనుచరగణం ఉండడం.. మంచి పరిచయాలు ఉండడం.. పాలేరు నియోజకవర్గంలోనూ ఆయనకు అభిమానగణం ఉండడంతో జలగం చేరిక తన విజయానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం.. ప్రసాదరావు చేరిక యోచన పట్ల సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రసాదరావు సోదరుడు జలగం వెంకట్రావు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు. మరోసారి అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్దరు సోదరులు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితులు ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

3 లేదా 5న ముహూర్తం.. 
జిల్లాలో తన అనుచరగణం, అభిమానులతో చర్చించిన మీదట వారి నుంచి వచ్చే సానుకూలత మేరకు ఈనెల 3 లేదా 5వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధపడాలని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం అనుచరులతో జరిగిన సమాలోచనల్లో అనేక మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీ తీర్థం పుచ్చుకోవడమా? జిల్లాలో సభ నిర్వహించి.. సీఎంను ఆహ్వానించడమా? అనే అంశం సైతం భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

కార్యకర్తల అభీష్టం మేరకే టీఆర్‌ఎస్‌లో చేరతా..

పెనుబల్లి: ఈ ప్రాంత అభివృద్ధి కోసం.. కార్యకర్తల అభీష్టం మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరతానని మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు తెలిపారు. మండలంలోని తుమ్మలపల్లిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్‌రావు మాట్లాడారు. మూడు నెలలుగా కాంగ్రెస్‌ పార్టీ తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని చెబుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మహాకూటమి వల్ల తనకు సీటు ఇచ్చే పరిస్థితి లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారని, తనకు సీటు ఇచ్చేందుకు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌ అడ్డుకుంటున్నారని చెప్పారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో చూద్దామని దాటవేసే సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఈ తరుణంలో బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి, ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపునకు తమతో కలిసి పనిచేయాలని కోరారన్నారు. టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ పొత్తుకట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరగదని, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్టానానికి చెప్పినా.. అది జాతీయ స్థాయి నిర్ణయమని వారు చెప్పి తమ గొయ్యి తామే తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తుందని, గెలిచే కార్యకర్తలకు అవకాశం లేకుండా మిత్రపక్షాలతో సీట్లు పంచుకుంటున్నారు తప్ప వీరు చేసేదేమీ లేదన్నారు. రేణుకా చౌదరి, భట్టి, సుధాకర్‌రెడ్డి, సంభానితో కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి టీఆర్‌ఎస్‌లో చేరతానన్నారు. రెండు మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తిరిగి కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి అభీష్టంతో టీఆర్‌ఎస్‌లో చేరతానని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement