jalagam Prasada
-
వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే
సాక్షి,సత్తుపల్లి: భూ నిర్వాసితుల సమస్యలు తెలుసు. కొంతమంది అధికారుల తప్పిందం వల్ల గ్రామం పోతోంది. సీఎం కేసీఆర్, సింగరేణి సీఎండీలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని కొమ్మేపల్లి, యాతాలకుంట, చెరుకుపల్లి, కిష్టారం గ్రామాల్లో డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. నిర్వాసితులకు జగన్నాథపురంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్న తరహాలోనే కొమ్మేపల్లి నిర్వాసితులకు కూడా ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని, రూ.1.30 లక్షలు ఎటూ సరిపోవన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చారని మొట్ట మొదటిసారిగా చెప్పారన్నారు. టీఆర్ఎస్లో చేరేటప్పుడే.. గిరిజనులు, దళితులు, పేదల సంక్షేమం కోసం పోడు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరానన్నారు. కొమ్మేపల్లి పట్టా భూముల సమస్యలను కేసీఆర్‌కు చెప్పి సత్వర పరిష్కారం అయ్యేలా చేస్తానని.. ఏ పనులు జరగాలన్నా.. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. చెరుకుపల్లిలో పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానని గిరిజనులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యుడు మట్టా దయానంద్, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సోమరాజు సీతారామారావు, మోరంపూడి ప్రభాకర్, తుమ్మూరు శ్రీనివాసరావు, అమరవరపు కృష్ణారావు, కొడిమెల అప్పారావు, జ్యేష్ట లక్ష్మణరావు, ఐ. శ్రీను మొదుగు పుల్లారావు, ఎండీ యాసీన్, మౌలాలీ, షఫీ, సుభాని పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటేయండి సత్తుపల్లి: టీఆర్ఎస్ పార్టీని బలపర్చి కారుగుర్తుకు ఓటేయండని డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు కోరారు. పట్టణంలోని జవహర్‌నగర్‌లో గురువారం టీఆర్ఎస్లో చేరిన తన్నీరు వెంకటేశ్వరరావు, అరవపల్లి అమరయ్య, దుర్గారావు, మల్లీశ్వరి, తులశమ్మ, దానియేలు, లేయమ్మ, శివమ్మ, షారుక్, జయమ్మ, కమలమ్మలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని.. ఆసరా పెన్షన్లు రూ.2,016, వికలాంగుల పెన్షన్లు రూ.3,016లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూ.1,0116లు అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, దొడ్డాకుల స్వాతిగోపాలరావు, కోటగిరి వెంకటరావు, రామకృష్ణ, విష్ణు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో చేరుతున్నా : మాజీ మంత్రి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు.. హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్ఎస్లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్ వ్యవహార శైలిపై.. తన బహిష్కరణపై పార్టీ అనుసరించిన నాన్చుడు ధోరణిని ఎండగట్టిన 24 గంటల్లోనే ఆ పార్టీ ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించింది. దీంతో జలగం ప్రసాదరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై శుక్రవారం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రసాదరావుపై బహిష్కరణను ఎత్తివేస్తున్నట్లు ప్రసార సాధనాల్లో ప్రచారం కావడం, ఏఐసీసీ నేతలు ఆయనను కలవడానికి వస్తున్నారంటూ మరో ప్రచారం ఊపందుకోవడంతో ప్రసాదరావు మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే జలగం ప్రసాదరావు మాత్రం తన అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు టీఆర్ఎస్లో చేరుతున్నామని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని, మూడు నెలలుగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ తన అభిమానులు, అనుచరుల్లో గందరగోళం సృష్టించడానికి ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటూ శుక్రవారం తనను కలిసిన అభిమానులు, అనుచరులకు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నామని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదంటూ కరాఖండిగా చెప్పడంతో జలగం గులాబీ గూటికి చేరడం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు పార్టీలో చేరడం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తన అనుచరులు, అభిమానులను హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన ప్రసాదరావు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎంతోపాటు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర పార్టీ నుంచి సదరు నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అనుచరుల్లో ఉత్తేజం.. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జలగం ప్రసాదరావు తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సమాయత్తం కావడం ఆయన అనుచరులు, వర్గీయుల్లో ఉత్తేజం నింపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎటువైపు మొగ్గు చూపాలన్న అంశంపై ఆయన అభిమానులు, అనుచరుల నుంచి పలు సూచనలు వచ్చినా.. కాంగ్రెస్‌కు విశేష సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు అని కూడా చూడకుండా.. తన పట్ల గౌరవంగా వ్యవహరించలేదని, పార్టీలో చేర్చుకునే విషయలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందని ప్రసాదరావు తనను కలిసిన అభిమానులు, అనుచరులకు సవివరంగా వివరించడంతో మెజార్టీ అభిమానులు టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రసాదరావుకు ఏ రకమైన స్థానం కల్పిస్తారనే అంశంపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతున్నా.. పార్టీలో పనిచేసి అధినేతను మెప్పిస్తే పదవులకు కొదవలేదని, ముందు అప్పగించిన పనిని విజయవంతం చేస్తే గుర్తింపు అదే వస్తుందని జలగం ప్రసాదరావు అనుచరులు, అభిమానులకు ఉద్బోధించారు. కాంగ్రెస్ పార్టీలో తనను చేరకుండా అడ్డుకున్న జిల్లా నేతల ఓటమే ధ్యేయంగా ఆయన పలు నియోజకవర్గాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లో ప్రసాదరావు చేరడం ద్వారా పలు నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని, అనేక మంది ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆయన వర్గీయుల్లో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా రక్తికట్టిస్తోంది. తొలుత ప్రసాదరావు తన అనుచరులు, అభిమానులతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లేదా ఖమ్మంలో సభ నిర్వహించి.. సీఎంను ఆహ్వానించాలని భావించినా.. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తక్షణమే పార్టీలో చేరాల్సిన ఆవశ్యకతను టీఆర్ఎస్ నేతలు చెప్పడంతో ఆయన పార్టీలో చేరడానికి 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పార్టీలో చేరిన తర్వాత జిల్లా కేంద్రమైన ఖమ్మం.. లేదా సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరుతున్నా.. సుదీర్ఘకాలంగా నాతో ఉన్న అనుచరులు, అభిమానుల మెజార్టీ అభిప్రాయం మేరకు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నా. ఈ మేరకు శనివారం సాయంత్రం టీఆర్ఎస్ భవన్లో అధికారికంగా పార్టీలో చేరుతున్నా. నేను టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాక కాంగ్రెస్ పార్టీ నాపై ఉన్న బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ విజయానికి కృషి చేస్తాను. కాంగ్రెస్, టీడీపీల పొత్తును జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు, సీనియర్ కార్యకర్తలు మథనపడుతున్నారు. -
కారెక్కనున్న కాంగ్రెస్ మాజీ మంత్రి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి. ఇప్పుడు బహిష్కృత నేత. నిన్నటి వరకు కాంగ్రెస్ మళ్లీ తనను సాదరంగా ఆహ్వానిస్తుందని ఎదురుచూశారు. పార్టీ తాత్సారం చేయడం.. ఇంతలోనే కారెక్కేందుకు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరగడం.. అనుచరులతో సమావేశం జరపడం కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నుంచి తన చేరికకు సానుకూల సంకేతాలు రాకపోవడంతో రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నట్లు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే అనూహ్య రీతిలో జలగం ప్రసాదరావుకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆహ్వానం అందడం, సాక్షాత్తూ మంత్రి కేటీఆర్.. ప్రసాదరావుతో భేటీ కావడం, ఇందులో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కీలక భూమిక పోషించారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే జలగం ప్రసాదరావు హుటాహుటిన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని తన నివాస గృహానికి చేరడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లయింది. గురువారం జిల్లాలోని జలగం ప్రసాదరావు రాజకీయ శిబిరంలో సైతం మెరుపు వేగంతో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రసాదరావు కుప్పెనకుంట్లకు వచ్చినట్లు తన అనుచరులకు సమాచారం ఇవ్వడంతో గురువారం జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆయన అనుచరులు, వివిధ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు జలగంతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ నేతలు సైతం ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, సత్తుపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి.. జలగం ప్రసాదరావుతో కుప్పెనకుంట్లలోని ఆయన నివాసంలో భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా రాజకీయ అంశాలపై ఆచితూచి స్పందించి.. ఎప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేసి తన అంతరంగాన్ని తెలియకుండా రాజకీయ చతురత ప్రదర్శించే ప్రసాదరావు.. గురువారం జరిగిన తన అనుచర వర్గం భేటీలో, మీడియా సమావేశంలోనూ పలు అంశాలపై విస్పష్టంగా.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులు, టీఆర్ఎస్ నుంచి అందిన ఆహ్వానాన్ని ఆయన అనుచరులకు వివరించారు. కాంగ్రెస్‌లో చేరడం కోసం ఇప్పటివరకు నిరీక్షించిన ప్రసాదరావుకు చేరికపై అధిష్టానం ఇదిగో.. అదిగో అంటూ వాయిదా వేయడంతో ఆయన వర్గీయుల్లో నెలకొన్న అసహనం సైతం ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేందుకు పురిగొల్పిందన్న వాదన ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. సంప్రదింపుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. జలగం ప్రసాదరావును కాంగ్రెస్‌లోకి తిరిగి తీసుకునేందుకు మూడు నెలల క్రితం సమావేశమైన పీసీసీ సంప్రదింపుల కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. అయితే జిల్లా కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. ఆ సమావేశంలో ఒకరిద్దరు నేతలు అభిప్రాయపడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే జిల్లా కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏమిటో? ఆయనను చేర్చుకుంటున్నారో? లేదో? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం, పార్టీలో కొందరు నేతలు తన చేరికకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని భావించిన ప్రసాదరావు కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించారు. పార్టీ నుంచి ఏ రకమైన స్పందన లేకపోవడం.. ఆయన అనుచర వర్గం నుంచి రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి వస్తున్న తరు ణంలో టీఆర్ఎస్ సంప్రదించడంతో కేటీఆర్ తనను పార్టీలో చేరాల్సిందిగా కోరిన అంశాన్ని తన అనుచరులు, అభిమానులతో చర్చించారు. మెజార్టీ అనుచరు ల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని, తన కు కొంత సమయం కావాలని కేటీఆర్‌కు చెప్పినట్లు తన తో సమావేశమైన అనుచరులకు ప్రసాదరావు వివరించారు. రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అందులో మీకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రసాదరావుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుందని అప్పుడే ఆయన వర్గీయులు అంచనాలు వేస్తుండడం విశేషం. మనోభావాలు తెలుసుకునేందుకే.. కాంగ్రెస్‌లో తన బహిష్కరణను రద్దు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నా.. జిల్లా నేతలు అడ్డుగా మారారని, ఈసారికి తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారని, దీంతో రాజకీయంగా తన అవసరం ఉందని భావిస్తున్న టీఆర్ఎస్ అభిప్రాయంపై కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రసాదరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటే జిల్లాలో రాజకీయంగా పలు పరిణామాలు సంభవించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ ఆయన అనుచరులు అనేక మంది కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని, ప్రసాదరావు రాజకీయ నిర్ణ యాన్ని ప్రకటిస్తే వారందరూ ఆయన రాజకీయ అడుగులో అడుగు వేస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తు న్నాయి. జిల్లాలో టీఆర్ఎస్కు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతున్న నేతలను ఓడించేందుకు జలగం రాజకీయ వ్యూహాలు తమకు ఉపయోగపడతాయని టీఆర్ఎస్ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. 1999లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో పని చేశారన్న కారణంతో ప్రసాదరావుపై కాంగ్రెస్ అధిష్టానం ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేసింది. వాస్తవానికి ఆ గడువు 2005లోనే తీరినా.. జలగం కాంగ్రెస్‌లో చేరడానికి పెద్దగా సుముఖత చూపకపోవడం.. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. æఈ క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జలగం తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు కాంగ్రెస్ సంప్రదింపుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆయన మినహా ఆ కమిటీ ఓకే చేసిన వారందరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. ఈ పరిణామాలతో ఖిన్నుడైన జలగం ఇక కాంగ్రెస్ వైపు చూడడం వల్ల ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రసాదరావు 1983లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్నతరహా పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయలేదు. జలగం కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో ఆయన పార్టీలో చేరి పాలేరు నుంచి పోటీ చేస్తారని, మంత్రి తుమ్మలకు దీటైన అభ్యర్థి అవుతారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రసాదరావుకు జిల్లావ్యాప్తంగా అనుచరగణం ఉండడం.. మంచి పరిచయాలు ఉండడం.. పాలేరు నియోజకవర్గంలోనూ ఆయనకు అభిమానగణం ఉండడంతో జలగం చేరిక తన విజయానికి ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం.. ప్రసాదరావు చేరిక యోచన పట్ల సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రసాదరావు సోదరుడు జలగం వెంకట్రావు ఇప్పటికే టీఆర్ఎస్లో కొనసాగుతూ.. కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2014లో ఎన్నికయ్యారు. మరోసారి అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇద్దరు సోదరులు ఒకే పార్టీలో కొనసాగే పరిస్థితులు ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 3 లేదా 5న ముహూర్తం.. జిల్లాలో తన అనుచరగణం, అభిమానులతో చర్చించిన మీదట వారి నుంచి వచ్చే సానుకూలత మేరకు ఈనెల 3 లేదా 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడాలని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం అనుచరులతో జరిగిన సమాలోచనల్లో అనేక మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీ తీర్థం పుచ్చుకోవడమా? జిల్లాలో సభ నిర్వహించి.. సీఎంను ఆహ్వానించడమా? అనే అంశం సైతం భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. కార్యకర్తల అభీష్టం మేరకే టీఆర్ఎస్లో చేరతా.. పెనుబల్లి: ఈ ప్రాంత అభివృద్ధి కోసం.. కార్యకర్తల అభీష్టం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు తెలిపారు. మండలంలోని తుమ్మలపల్లిలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్‌రావు మాట్లాడారు. మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని చెబుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మహాకూటమి వల్ల తనకు సీటు ఇచ్చే పరిస్థితి లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారని, తనకు సీటు ఇచ్చేందుకు రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్ అడ్డుకుంటున్నారని చెప్పారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో చూద్దామని దాటవేసే సమాధానం చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ తరుణంలో బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి, ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి, అభ్యర్థుల గెలుపునకు తమతో కలిసి పనిచేయాలని కోరారన్నారు. టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకట్టడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరగదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినా.. అది జాతీయ స్థాయి నిర్ణయమని వారు చెప్పి తమ గొయ్యి తామే తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సీట్లు ఇస్తుందని, గెలిచే కార్యకర్తలకు అవకాశం లేకుండా మిత్రపక్షాలతో సీట్లు పంచుకుంటున్నారు తప్ప వీరు చేసేదేమీ లేదన్నారు. రేణుకా చౌదరి, భట్టి, సుధాకర్‌రెడ్డి, సంభానితో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుందన్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి టీఆర్ఎస్లో చేరతానన్నారు. రెండు మూడు రోజులపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తిరిగి కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి అభీష్టంతో టీఆర్ఎస్లో చేరతానని ఆయన వివరించారు. -
‘చేయి’కలిపేనా?
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జలగం ప్రసాదరావు అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. నేతలు, అప్పటి శ్రేణులు ఏం జరుగుతుందా..? అని ఆసక్తిగా చూస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకప్పుడు ఒంటిచేత్తో నడిపిన నేతగా పేరొందిన జలగం ప్రసాదరావు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీలోనూ.. ఇటు అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. జిల్లా కాంగ్రెస్‌లో తమకంటూ ప్రత్యేకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని..జిల్లాపై చెరగని ముద్రతో సుదీర్ఘ రాజకీయ పయనం చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబం తదనంతరం సంభవించిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబానికి ఇప్పటికీ తగిన ఆదరణ ఉందన్న భావన, వారు క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న విశ్వాసం ఆ పార్టీకి చెందిన అనేకమంది ద్వితీయశ్రేణి నేతల్లో ఉండటం విశేషం. జిల్లాలోని పలు మండలాల నేతలు జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ ఆహ్వానించాలంటూ ఏకంగా మండల కమిటీల ద్వారా తీర్మానం చేయడం కాంగ్రెస్ పార్టీతో జలగం కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, దాదాపు రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయ పరిణామాలను పరిశీలించడానికే పరిమితమైన జలగం ప్రసాదరావు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా..చురుకైన పాత్ర పోషిస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో కొందరు మోదంగా.. మరికొందరు ఖేదంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో గల తన ఇంటి వద్ద ఉంటూనే జిల్లా రాజకీయ పరిణామాలను తెలుసుకుంటూ, అడపా దడపా రాజకీయ అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలకే పరిమితమయ్యారు. ఈసారి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈయన సోదరుడు, ప్రస్తుతం అధికార పార్టీ నుంచి కొత్తగూడెం శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావు రాజకీయాల్లో ఉన్న విషయం విదితమే. అప్పట్లో ఆయన హవా.. 1983కు ముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జలగం ప్రసాదరావు 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించడం విశేషం. 1985 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లక్కినేని జోగారావుపై తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించగా..1989 ఎన్నికల్లో అప్పటికే ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ప్రసాదరావు విజయం సాధించారు. 1989లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జలగం ప్రసాదరావు హవా జిల్లాలో కొనసాగింది. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా, అంతకు ముందు లఘుపరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన జలగం జిల్లా రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో నడిపించారన్న పేరుంది. దీంతో ఆయనకు పార్టీలోనే అనేకమంది ప్రత్యర్థులు తయారయ్యారని, ఆయన హవాను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలే విశ్వప్రయత్నాలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయాలకు ఇలా దూరం.. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీచేసిన జలగం ప్రసాదరావు అప్పుడు టీడీపీ నుంచి పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జలగం ప్రసాదరావు..1999లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి సీటు ఆశించారు. అయితే కాంగ్రెస్‌పార్టీలో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పోటీచేసి టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓటమిచెందారు. తదనంతరం రాజకీయ పరిణామాల్లో జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావును పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాల నేతలు పోరు చేయడంతో ఎట్టకేలకు ఆయనను బహిష్కరించారని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న జల గం ప్రసాదరావు గతంలో అనేకసార్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటుందని ప్రచారం జరిగింది. తండ్రి కూడా సుదీర్ఘ విరామం తర్వాతే.. జలగం ప్రసాదరావు తండ్రి, దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సుదీర్ఘ రాజకీయ విరామం అనంతరం 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణంతో రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఆ తర్వాత కొద్ది కాలానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై పోరు సలిపారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ మననం చేసుకుంటారు. ఈసారి రావడం ఖాయమేనా..? ఈసారి జలగం ప్రసాదరరావు..క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాన్ని, మద్దతును ఒకవైపు కూడగట్టుకుంటూ, కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రామచంద్రకుంతియాతోపాటు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇరువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్నప్పుడు తమ ఓటమికి కంకణం కట్టుకున్నారని, ఇప్పుడు పార్టీ బలోపేతమైన దిశలో చేరుతామంటే ఎలా అంగీకరిస్తామని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా..చేర్చుకోకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారంతో..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రసాదరావు కాంగ్రెస్‌కు చేరువ అవుతున్నారన్న ప్రచారం అనేక గ్రామ పంచాయతీల్లో..విజయతీరాలకు తీసుకెళ్తుందని, అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారని, రావాలని గట్టిగా పట్టుపడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు జలగం ప్రసాదరావు సైతం అదే స్థాయిలో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు
లింగాలపల్లి(దమ్మపేట) : రాష్ట్రంలో ఖరీ దైన రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొం డివర్రె, లింగాలపల్లి, జమేదార్ బంజర్ పంచాయతీల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లింగాలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాలను విభజిస్తున్నామని చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పాల నా సౌలభ్యం కోసం కాకుండా నాయకుల అభీష్టం మేరకే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రజాభిప్రాయాలను లెక్కలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు. రెండో విడతలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులకే బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు లంచాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేసే వారని.. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉందని వాపోయారు. కాగా.. ఇందిరమ్మ ఇళ్లు కురుస్తున్నాయని.. వానాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తమకు గతంలో అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిందని, ఆ భూములను నేటికీ చూపలేదని పలువురు ఆయనకు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి, కలెక్టర్లకు లేఖలు రాస్తానని ప్రసాదరావు తెలిపారు. జమేదార్ బంజర్, లింగాలపల్లి పంచాయతీలను ఏజెన్సీలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఆయన వెంట కక్కిరాల రత్నాకరరావు, సున్నం నాగమణి, అంకత మహేశ్వరరావు, కంభం పాటి సత్యనారాయణ, వాసం శ్రీనివాసరావు, చిన్నశెట్టి సత్యనారాయణ, దారా శ్రీను, గట్ల వెంకటేశ్వరరావు, మద్దిశెట్టి సత్యప్రసాద్, తుమ్మా రాంబాబు ఉన్నా రు. కాగా.. మొండివర్రెలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ.జానీ ఇచ్చి న తేనీటి విందులో ఆయన పాల్గొన్నారు.