సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజకీయ అజ్ఞాతవాసానికి తెరపడనుంది. దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జలగం ప్రసాదరావు తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకునేందుకు సమాయత్తమయ్యారు. రాష్ట్ర మాజీ మంత్రి జలగం ప్రసాదరావు.. హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ప్రసాదరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుచర గణంతో సిద్ధమవుతున్నారని రెండు రోజులుగా ప్రచారం కావడం, కాంగ్రెస్ వ్యవహార శైలిపై.. తన బహిష్కరణపై పార్టీ అనుసరించిన నాన్చుడు ధోరణిని ఎండగట్టిన 24 గంటల్లోనే ఆ పార్టీ ఆయనపై బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించింది. దీంతో జలగం ప్రసాదరావు ఎటువైపు మొగ్గు చూపుతారన్న అంశంపై శుక్రవారం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఉదయం 10 గంటలకు ప్రసాదరావుపై బహిష్కరణను ఎత్తివేస్తున్నట్లు ప్రసార సాధనాల్లో ప్రచారం కావడం, ఏఐసీసీ నేతలు ఆయనను కలవడానికి వస్తున్నారంటూ మరో ప్రచారం ఊపందుకోవడంతో ప్రసాదరావు మనసు మార్చుకుని కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే జలగం ప్రసాదరావు మాత్రం తన అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని, మూడు నెలలుగా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ తన అభిమానులు, అనుచరుల్లో గందరగోళం సృష్టించడానికి ఈ తరహా ప్రయత్నం చేస్తోందంటూ శుక్రవారం తనను కలిసిన అభిమానులు, అనుచరులకు స్పష్టం చేశారు.
శనివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నామని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదంటూ కరాఖండిగా చెప్పడంతో జలగం గులాబీ గూటికి చేరడం ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం వరకు పార్టీలో చేరడం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తన అనుచరులు, అభిమానులను హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైన ప్రసాదరావు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. సీఎంతోపాటు జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర పార్టీ నుంచి సదరు నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
అనుచరుల్లో ఉత్తేజం..
దాదాపు 18 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న జలగం ప్రసాదరావు తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సమాయత్తం కావడం ఆయన అనుచరులు, వర్గీయుల్లో ఉత్తేజం నింపుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎటువైపు మొగ్గు చూపాలన్న అంశంపై ఆయన అభిమానులు, అనుచరుల నుంచి పలు సూచనలు వచ్చినా.. కాంగ్రెస్‌కు విశేష సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు అని కూడా చూడకుండా.. తన పట్ల గౌరవంగా వ్యవహరించలేదని, పార్టీలో చేర్చుకునే విషయలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిందని ప్రసాదరావు తనను కలిసిన అభిమానులు, అనుచరులకు సవివరంగా వివరించడంతో మెజార్టీ అభిమానులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీలో ప్రసాదరావుకు ఏ రకమైన స్థానం కల్పిస్తారనే అంశంపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతున్నా.. పార్టీలో పనిచేసి అధినేతను మెప్పిస్తే పదవులకు కొదవలేదని, ముందు అప్పగించిన పనిని విజయవంతం చేస్తే గుర్తింపు అదే వస్తుందని జలగం ప్రసాదరావు అనుచరులు, అభిమానులకు ఉద్బోధించారు. కాంగ్రెస్ పార్టీలో తనను చేరకుండా అడ్డుకున్న జిల్లా నేతల ఓటమే ధ్యేయంగా ఆయన పలు నియోజకవర్గాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌లో ప్రసాదరావు చేరడం ద్వారా పలు నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని, అనేక మంది ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆయన వర్గీయుల్లో జరుగుతున్న ప్రచారం రాజకీయంగా రక్తికట్టిస్తోంది.
తొలుత ప్రసాదరావు తన అనుచరులు, అభిమానులతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లేదా ఖమ్మంలో సభ నిర్వహించి.. సీఎంను ఆహ్వానించాలని భావించినా.. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తక్షణమే పార్టీలో చేరాల్సిన ఆవశ్యకతను టీఆర్‌ఎస్ నేతలు చెప్పడంతో ఆయన పార్టీలో చేరడానికి 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో పార్టీలో చేరిన తర్వాత జిల్లా కేంద్రమైన ఖమ్మం.. లేదా సత్తుపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా..
సుదీర్ఘకాలంగా నాతో ఉన్న అనుచరులు, అభిమానుల మెజార్టీ అభిప్రాయం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఈ మేరకు శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్ భవన్‌లో అధికారికంగా పార్టీలో చేరుతున్నా. నేను టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాక కాంగ్రెస్ పార్టీ నాపై ఉన్న బహిష్కరణను ఎత్తివేసినట్లు ప్రకటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జిల్లాలో టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ విజయానికి కృషి చేస్తాను. కాంగ్రెస్, టీడీపీల పొత్తును జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు, సీనియర్ కార్యకర్తలు మథనపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment