ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జలగం ప్రసాదరావు అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. నేతలు, అప్పటి శ్రేణులు ఏం జరుగుతుందా..? అని ఆసక్తిగా చూస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకప్పుడు ఒంటిచేత్తో నడిపిన నేతగా పేరొందిన జలగం ప్రసాదరావు మళ్లీ రాజకీయ అరంగేట్రం చేస్తారన్న ప్రచారం అటు కాంగ్రెస్ పార్టీలోనూ.. ఇటు అన్ని రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. జిల్లా కాంగ్రెస్‌లో తమకంటూ ప్రత్యేకవర్గాన్ని ఏర్పాటు చేసుకుని..జిల్లాపై చెరగని ముద్రతో సుదీర్ఘ రాజకీయ పయనం చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుటుంబం తదనంతరం సంభవించిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయినా కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబానికి ఇప్పటికీ తగిన ఆదరణ ఉందన్న భావన, వారు క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న విశ్వాసం ఆ పార్టీకి చెందిన అనేకమంది ద్వితీయశ్రేణి నేతల్లో ఉండటం విశేషం.
జిల్లాలోని పలు మండలాల నేతలు జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ ఆహ్వానించాలంటూ ఏకంగా మండల కమిటీల ద్వారా తీర్మానం చేయడం కాంగ్రెస్ పార్టీతో జలగం కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, దాదాపు రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయ పరిణామాలను పరిశీలించడానికే పరిమితమైన జలగం ప్రసాదరావు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా..చురుకైన పాత్ర పోషిస్తారన్న ప్రచారం కాంగ్రెస్‌లో కొందరు మోదంగా.. మరికొందరు ఖేదంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజకీయ కార్యకలాపాలపై దృష్టి సారించకుండా పెనుబల్లి మండలంలోని కుప్పెనకుంట్లలో గల తన ఇంటి వద్ద ఉంటూనే జిల్లా రాజకీయ పరిణామాలను తెలుసుకుంటూ, అడపా దడపా రాజకీయ అంశాలను ప్రస్తావించడం వంటి అంశాలకే పరిమితమయ్యారు. ఈసారి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈయన సోదరుడు, ప్రస్తుతం అధికార పార్టీ నుంచి కొత్తగూడెం శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావు రాజకీయాల్లో ఉన్న విషయం విదితమే.
అప్పట్లో ఆయన హవా..
1983కు ముందు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జలగం ప్రసాదరావు 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్‌టీఆర్ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఆ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించడం విశేషం. 1985 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి లక్కినేని జోగారావుపై తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించగా..1989 ఎన్నికల్లో అప్పటికే ఎన్‌టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ప్రసాదరావు విజయం సాధించారు. 1989లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో జలగం ప్రసాదరావు హవా జిల్లాలో కొనసాగింది. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా, అంతకు ముందు లఘుపరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన జలగం జిల్లా రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని ఒంటిచేత్తో నడిపించారన్న పేరుంది. దీంతో ఆయనకు పార్టీలోనే అనేకమంది ప్రత్యర్థులు తయారయ్యారని, ఆయన హవాను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలే విశ్వప్రయత్నాలు చేశారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.
రాజకీయాలకు ఇలా దూరం..
1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీచేసిన జలగం ప్రసాదరావు అప్పుడు టీడీపీ నుంచి పోటీచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓడిపోయారు. అప్పటి నుంచి 1999 వరకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న జలగం ప్రసాదరావు..1999లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి సీటు ఆశించారు. అయితే కాంగ్రెస్‌పార్టీలో జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పోటీచేసి టీడీపీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఓటమిచెందారు. తదనంతరం రాజకీయ పరిణామాల్లో జిల్లాకు చెందిన జలగం ప్రసాదరావును పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీలోని వివిధ వర్గాల నేతలు పోరు చేయడంతో ఎట్టకేలకు ఆయనను బహిష్కరించారని సీనియర్ కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న జల గం ప్రసాదరావు గతంలో అనేకసార్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటుందని ప్రచారం జరిగింది.
తండ్రి కూడా సుదీర్ఘ విరామం తర్వాతే..
జలగం ప్రసాదరావు తండ్రి, దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సుదీర్ఘ రాజకీయ విరామం అనంతరం 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణంతో రాజీవ్‌గాంధీ పిలుపు మేరకు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా, ఆ తర్వాత కొద్ది కాలానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ విధానాలపై పోరు సలిపారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ మననం చేసుకుంటారు.
ఈసారి రావడం ఖాయమేనా..?
ఈసారి జలగం ప్రసాదరరావు..క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాన్ని, మద్దతును ఒకవైపు కూడగట్టుకుంటూ, కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ రామచంద్రకుంతియాతోపాటు ఢిల్లీలో పలువురు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇరువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్నప్పుడు తమ ఓటమికి కంకణం కట్టుకున్నారని, ఇప్పుడు పార్టీ బలోపేతమైన దిశలో చేరుతామంటే ఎలా అంగీకరిస్తామని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే జలగం ప్రసాదరావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా..చేర్చుకోకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారంతో..స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రసాదరావు కాంగ్రెస్‌కు చేరువ అవుతున్నారన్న ప్రచారం అనేక గ్రామ పంచాయతీల్లో..విజయతీరాలకు తీసుకెళ్తుందని, అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారని, రావాలని గట్టిగా పట్టుపడుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు జలగం ప్రసాదరావు సైతం అదే స్థాయిలో తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment