అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి | congress leader janareddy criticised trs government | Sakshi
Sakshi News home page

అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి

Published Fri, Mar 17 2017 3:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి - Sakshi

అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి

బడ్జెట్‌ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నా అభివృద్ధి ఏది?
ఆశల పల్లకిలో ఊరేగించారు.. భ్రమింపజేసే బడ్జెట్‌ ఇది వాస్తవికతకు దూరంగా ఉంది..
గతబడ్జెట్‌ అసలు లెక్కలు మరిచిపోయారా?
లోటును దాచి లేని మిగులు చూపితే కేంద్రం నుంచి మనకే నిధులు తగ్గుతాయి
వ్యవసాయం గొప్పగా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి ఎందుకు తగ్గింది?


సాక్షి, హైదరాబాద్‌: ‘‘నైరాశ్యం నుంచి ఆశావహం వైపు పయనం సాగిస్తున్నామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. నిజమే.. ప్రజలకు ఆశలు కల్పించేలా అంకెలు చూపారు. అభివృద్ధి ఎల్లలు దాటుతోందని చెప్పారు. బడ్జెట్‌ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నాయి.. మరి నిజమైన అభివృద్ధి ఎటుపోయింది? ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ అంకెల పెరుగుదల రేటు ఇంతగా లేదు. ప్రజలను గొప్ప ప్రగతి అంటూ భ్రమింపజేసే ప్రయత్నం భేషుగ్గా జరిగింది. ఆశల పల్లకిలో ఊరేగించేశారు. ఏ రకంగానూ ఇది వాస్తవిక బడ్జెట్‌ కాదు..’’అని ప్రతిపక్ష నేత జానారెడ్డి దుయ్యబట్టారు.

ఆర్భాటాలకు పోయి ప్రభుత్వం బడ్జెట్‌ గణాంకాలను భారీగా చూపి తుదకు రాష్ట్రానికి భారీ నష్టాన్ని తేబోందని హెచ్చరించారు. లోటు కనపడకుండా అంకెల్లో మిగులును చూపి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోకాలొడ్డి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో గురువారం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అనుమానాలుంటే నివృత్తి చేయాలి తప్ప వాటిని కొట్టిపడేయొద్దని, తాము అలా కొట్టేశాం కాబట్టే మమ్మల్ని ఇలా కొట్టిపడేశారని వ్యాఖ్యానించారు.

లోటు ఉంటే మిగులు ఎలా చూపుతారు?
వ్యవసాయం గొప్పగా ఉందంటున్న ప్రభుత్వం ఈ లెక్కలకు సమాధానం చెప్పాలంటూ జానారెడ్డి కొన్ని గణాంకాలను సభ ముందుంచారు. 2013–14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 72 లక్షల టన్నులు, 51 లక్షల టన్నులకు పడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘‘2015–16 కాగ్‌ ఆడిట్‌ నివేదికలో.. రెవెన్యూ రాబడి రూ.73 వేల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.77 వేల కోట్లుగా ఉంది. ఆ నివేదిక రూ.4 వేల కోట్ల లోటు చూపిస్తుంటే మీ లెక్కలు మాత్రం మిగులును చూపుతున్నాయి, అభివృద్ధి ఎల్లలు దాటిందంటే ఇదేనా?’’అని జానారెడ్డి ప్రశ్నించారు.

‘‘గత బడ్జెట్‌లో పన్నుల ఆదాయం రూ.46 వేల కోట్లకు మించదు అని నేను చెప్పా.. సవరించిన అంచనాలు దాన్ని దాదాపు నిజం చేసిన మాట మరిచారా? ఈసారి రూ.62 వేల కోట్లు అంటున్నారు. అది రూ.52 వేల కోట్లను మించదు. వివిధ ఆదాయాల్లో దాదాపు రూ.25 వేల కోట్ల మేర తగ్గుదల ఉండబోతోంది. అలాంటపుపడు బడ్జెట్‌ను రూ.1.49 లక్షల కోట్లుగా ఎలా చూపుతారు?’’అని ప్రశ్నించారు. గత బడ్జెట్‌ రూ.1.30 లక్షల కోట్లుగా చూపి సవరణలో రూ.1.12 లక్షల కోట్లుగా చూపారని, అందులోనూ మరో రూ.10 వేల కోట్ల తేడా ఉండబోతోందన్నారు. దీన్ని చూసైనా వాస్తవ అంకెలు పేర్కొనాల్సిందని అభిప్రాయపడ్డారు.

సంక్షోభంలో వ్యవసాయం..
గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీలో జాప్యంతో, అప్పులు దొరక్క అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, పావలా వడ్డీ సకాలంలో చెల్లించటం లేదని, బడ్జెట్‌లో వ్యవసాయ కేటాయింపులు తగ్గాయని.. ఇవన్నీ వ్యవసాయ సంక్షోభాన్ని సూచించటం లేదా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోలు, ఇతర అంశాల్లో ప్రభుత్వ నిర్వాకం భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణమవుతుందన్నారు. ఇప్పుడు కోతలు లేవని సంబరపడ్డా భవిష్యత్‌లో వాతలు తప్పవని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌ కరెంటు విషయంలో ప్రణాళిక లేకుండా వ్యవహరించి ఖజానాపై తీవ్ర భారం మోపబోతున్నారన్నారు.

ఈఆర్‌సీ ధర నిర్ణయించకుండానే కరెంటు తీసుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్‌ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రకారం మెగావాట్‌కు రూ.9 కోట్లు ఖర్చవుతుందని, కొనే కరెంటుకు ఆ మేరకు ధర నిర్ణయిస్తే భారీగా భారం పడుతుందన్నారు. మహేశ్వరం కారిడార్‌ సిద్ధం కాకుండానే కరెంటును బుక్‌ చేసుకోవటం వల్ల ఏప్రిల్‌ నుంచి పవర్‌ వాడినా వాడకున్నా వపర్‌ గ్రిడ్‌కు సరఫరా ఖర్చు కింద యూనిట్‌కు 45 పైసలు, ఛత్తీస్‌గఢ్‌కు ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. టీఎస్‌ఐపాస్‌తో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా... కొత్తగా ఉపాధి పొందినవారి సంఖ్య నిరాశాజనకంగా ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసిందన్నారు.

జానా మాటల్లో కొన్ని విరుపులు..
– ప్రభుత్వం తీరును నిలదీస్తే విమర్శలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ సభలో నేను సరిగా మాట్లాడకుంటే పాలక పక్షంతో కుమ్మక్కయ్యారా అని ప్రజలు నన్ను అడుగుతారు.
– మీలాగా మేం కూడా కొన్ని ఆర్భాటపు ప్రకటనలు చేశాం. అవి తప్పని తెలుసుకుని తేరుకునే సరికి ఇక్కడొచ్చి కూర్చోవాల్సి వచ్చింది.
– అధికారంలోకి వచ్చాక ఇక ధర్నాలు లేవంటున్నారు. కానీ రాష్ట్రంలో యువత ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉంది. తెలంగాణ రావటానికి ఉద్యమంలో ముందుండి నిలబడింది ఆ యువతేనన్న విషయాన్ని పాలకపక్షం మరిచిపోయినట్టుంది. ధర్నాలే లేవంటూ.. అసలు ధర్నాలకు అవకాశం లేకుండా ధర్నా చౌక్‌ను తొలగిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement