ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ వలసలు జోరందుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రధాన పార్టీలు ఆపరేషన్ ఆకర్షను ముమ్మరం చేశాయి. అవతలి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గ, మండల స్థాయి నేతలను తమవైపు తిప్పుకొనేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా జిల్లాలో కండువాలు మారుస్తున్న నాయకులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీ మనో ధైర్యాన్ని దెబ్బతీయాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. కాగా టీఆర్‌ఎస్‌లో వేర్వేరు కారణాలతో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకొని రాజకీయంగా లబ్ధిపొందాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
సాక్షి, మెదక్: జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమ వలసలు దోబూచులాడుతున్నాయి. గురువారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు సహా పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా పరిధిలోని అల్లాదుర్గం జెడ్పీటీసీ, కొద్ది మంది నాయకులతో కలసి మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కింది స్థాయి కాంగ్రెస్ నాయకులను చేర్చుకోవడమేలక్ష్యంగా టీఆర్‌ఎస్ ముఖ్యులు పావులు కదుపుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు గులబీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు.
మెదక్‌లో టికెట్ దక్కని వారే టీఆర్‌ఎస్ టార్గెట్..?
మెదక్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారు సైతం అనేక మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కని వారంతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేఖంగా పని చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్‌లో టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్న నాయకులతో టీఆర్‌ఎస్ నేత దేవేందర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలు టికెట్లు రాకుంటే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పాపన్నపేట, చిన్నశంకరంపేట, మెదక్ మండలంలోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకులు పలువురు త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది. కాగా పాపన్నపేట మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, బాలాగౌడ్ మరికొంత మంది నాయకులు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. వీరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మెదక్ పట్టణంలో పలువురు అసంతప్తిగా ఉన్న టీఆర్‌ఎస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.
నర్సాపూర్‌లో పోటాపోటీగా వలసలు
నర్సాపూర్ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా వలసలకు స్కెచ్‌లు వేస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులను తమ వైపు లాగే ప్రయత్నం చేస్తుండగా, మాజీ మంత్రి సునీతారెడ్డి సైతం టీఆర్‌ఎస్ నాయకులను కాంగ్రెస్‌లోకి చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటీవల హత్నూర మాజీ ఎంపీపీ ఆంజనేయులు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. శివ్వంపేట మాజీ ఎంపీపీ గోవింద్ నాయక్ కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు.
కాగా నర్సాపూర్ మండలంలోని టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు రాజునాయక్, మాజీ సర్పంచ్ వెంకటేశ్ పలువురు అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కౌడిపల్లి మండలం ధార్మసాగర్ మాజీ సర్పంచ్ రాంరెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాగా ఆయన తమ్ముడు లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల వెల్దుర్తి మండలం ఆత్మ కమిటీ డైరెక్టర్ కర్రోల విజయ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా రెండు పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఈనెల 26న నర్సాపూర్‌లో టీఆర్‌ఎస్ సభ నిర్వహించనుంది. ఈ సభలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉంది.
టీఆర్‌ఎస్‌లో చేరిన టేక్మాల్ ఎంపీపీ మంత్రి సమక్షంలో గులాబీ గూటికి..
టేక్మాల్(మెదక్): టేక్మాల్ ఎంపీపీ అంజమ్మ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్‌ఎస్ గూటికి చేరారు. శనివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు సమక్షంలో అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులకు ఆకర్షితులై కాంగ్రెస్‌ని వీడుతున్నట్లు అంజమ్మ తెలిపారు. అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, పార్టీ సీనియర్ నాయకులు జైపాల్‌రెడ్డి, నాగభూషణం, భక్తుల వీరప్ప, పార్టీ మండలాధ్యక్షుడు యూసఫ్, సిద్ధయ్య, పులి హన్మంతు, అక్బర్ పాషా, సత్యం, రాజయ్య, భాస్కర్, విక్రం, రవి, సురేష్, కృష్టయ్య, శ్రీనివాస్, బాలకృష్ణ, ఓంకార్, మల్లేశం, భూమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment