
కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం లేక నష్టం: గండ్ర
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కొంత నష్టం జరిగిందని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బస్సుయాత్ర చేపట్టినట్లుగా.. ఈసారి ప్రచారం చేసే నేత లేని లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సహకరించినా స్థానికంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయామని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పటికీ పొత్తులు, టికెట్‌లంటూనే సమయం గడిచిపోయిందని, కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ముందుగా భావించామని, పరిస్థితులను వినియోగించుకోక పోవడంతో గట్టిగా పోటీపడాల్సి వచ్చిందన్నారు.