'ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం'
- ఆరోపణలేంటో చెప్పకుండా రాజయ్యను బర్తరఫ్ చేశారు
- ఏడాదిలో ఒక్క దళితుడికి ఉద్యోగం ఇవ్వలేదేమిటీ?
- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఆవేశపూరిత ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ‘ఉప ముఖ్యమంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి తీవ్రంగా అవమానపర్చారు. ఆయనపై వచ్చిన ఆరోపణలేంటో కూడా చెప్పకుండా తొల గించారు..అదే సమయంలో తీవ్ర అవినీతి ఆరోపణలున్న వారిని మంత్రులుగా కొనసాగిస్తున్నారు.. ఏడాది కాలంలో ఒక్క దళితుడికీ ఉద్యోగమివ్వలేదు. రాష్ట్రంలో దళితవ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ ప్రారంభించిన స్పీకర్ తొలుత సంపత్‌కు అవకాశమిచ్చారు. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచే ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. ఇందిరమ్మ బిల్లులు నిలిచిపోయి పేదలు ఇబ్బంది పడుతున్నారని చెబితే.. ‘అక్రమాలకు పాల్పడ్డవారి ముక్కుపిండి వసూలు చేసి చెల్లిస్తామ’ని సీఎం అంటున్నారని, ముక్కుపిండి వసూలు చేస్తారో, ముక్కు నేలకి రాసి చెల్లిస్తారో గానీ.. బడాబాబుల జోలికి వెళ్లకుండా పేదలపై ప్రతాపం చూపుతున్నారు’ అని విమర్శించారు.
నిరుపేదల ఇంటికి అల్లుడో, కోడలో వస్తే ఇబ్బందిగా ఉందని, కోళ్లు గొర్రెలతోపాటు ఇంట్లో గడుపుతుంటే చూడలేక రెండు బెడ్‌రూమ్‌ల ఇంటి హామీ ఇచ్చానన్న ముఖ్యమంత్రి దాన్ని విస్మరించారని, ఇప్పుడు ఆ అల్లుళ్లు, కోడళ్లు జేఏసీగా ఏర్పడి పోరుకు సిద్ధమవుతారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ తాత కొర్రబియ్యం తిన్నారని, తండ్రి రాగి సంగటి తిన్నారని, ఈటెల దొడ్డుబియ్యం, ఇప్పుడు సన్నబియ్యం తింటున్నారని.. ఇది కాలక్రమంలో వచ్చే మార్పేనని, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం అంతగొప్పగా చూపాల్సిన అవసరం లేదన్నారు.
ఈ సమయంలోనే దళిత వ్యతిరేక ప్రభుత్వం, రాజయ్యకు అవమానంఅంటూ పేర్కొన్నారు. దీంతో అధికారపక్ష సభ్యులు అడుగడుగునా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. సమయం మించిపోయిందంటూ డిప్యూటీ స్పీకర్ ఆయన మైక్ కట్ చేశారు. దీంతో ముందు వరస దగ్గరకొచ్చిన సంపత్ అక్కడి బల్లలను బలంగా చరుస్తూ మాట్లాడడం ప్రారంభించారు. ఆయన తీరును మంత్రులు నాయిని, తుమ్మల తప్పుబట్టారు. స్పీకర్ ఆయనకు మైక్ కేటాయించగా...మళ్లీ దళిత వ్యతిరేక ప్రభుత్వమంటూ సంపత్ ఆరోపణలు చేయటంతో డిప్యూటీ స్పీకర్ మళ్లీ మైక్ కట్ చేశారు.