
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలుగా ఎన్నికై శాసనసభకు రావడం చాలా సంతోషంగా ఉందని తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు తమపై నమ్మకాన్ని ఉంచి నియోజకవర్గ ప్రతినిధులుగా అసెంబ్లీకి పంపారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన హర్షవర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), హరిప్రియానాయక్(ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి(తాండూరు) గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
పెండింగ్ సమస్యలపై పోరాడుతా..
ప్రజలు నాకిచ్చిన అరుదైన అవకాశం ఇది. కొల్లాపూర్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. నియోజకవర్గంలో 20 సంవత్సరాలకుపైగా కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు శాసనసభ్యునిగా పోరాటం చేస్తాను. కొల్లాపూర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను.’
– హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్
నమ్మకాన్ని వమ్ము చేయను
‘ఈ రోజు కోసం పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఆ రోజు వచ్చింది. తాండూరు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తా.’
– రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు
పోడు సమస్య పరిష్కారానికి కృషి
చాలా సంతోషంగా ఉంది. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో పోడుభూముల సమస్య ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా కృషి చేస్తా. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుతోపాటు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళతా.
– హరిప్రియ, ఎమ్మెల్యే, ఇల్లెందు