ఎన్నికల ప్రచారంలో మహిళలతో మాట్లాడుతున్న రేణుక
సాక్షి, ఖమ్మం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడేది కాంగ్రెస్ పార్టీయేనని ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని విలీన గ్రామాల పరిధిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. పాండురంగాపురం, బల్లేపల్లి, జయనగర్‌కాలనీ, గోపాలపురం, రుద్రమకోట, పుట్టకోట, అల్లీపురం, కొత్తగూడెం, ధంసలాపురం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పేదల పక్షపాతి అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌లు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును నొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అప హాస్యం చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తురన్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. చాయ్‌వాలాగా మోదీ ప్రధానమంత్రి అయి కార్పొరేట్ శక్తులకు మాత్రం చౌకీదారుగా పని చేస్తున్నారన్నారు. నల్లధానాన్ని వెలికితీస్తానని చెప్పి అప్పులు ఎగ్గొట్టిన బడా పారిశ్రామిక వేత్తలకు అండగా నిలిచారన్నారు. గతంలో ఎంపీగా, మంత్రిగా పని చేసిన సమయంలో జిల్లాలో అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనతోపాటు తమ పార్టీ నాయకుల ఇళ్లల్లో సోదాల పేరుతో భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. హస్తం గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ప్రచారంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు మర్రి శశిధర్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ సంభాని చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మల్లీదు హైమావతి, కార్పొరేటర్ నాగండ్ల దీపక్‌చౌదరి, బాలగంగాధర్ తిలక్, వడ్డెబోయిన నరసింహారావు, మల్లీదు వెంకటేశ్వర్లు, భూక్యా భాషా, కోటేరు వెంకటరెడ్డి, తమ్మిన్ని నాగేశ్వరరావు, కోటేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment