హైదరాబాద్: రాష్ట్రంనుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం నిర్ణయించింది. సిట్టింగ్ సభ్యుడైన వి.హన్మంతరావునే పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని కాంగ్రెస్ భావించింది. అయితే శనివారం కాంగ్రెస్ శాసన సభాపక్షం భేటీలో చర్చించిన తర్వాత రాజ్యసభ బరినుంచి తాము తప్పుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పాలేరు ఓటమిపై శాసనసభాపక్ష భేటీలో సమీక్షించుకున్నామని సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు. సంఖ్యాబలం లేకపోవడం వల్లే రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. పోటీలో ఉండి రాజకీయాలు కలుషితం చేయకూడదని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. కాగా, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ... తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
'గతంలో టీఆర్ఎస్కు బలం లేకపోయినా కేకేకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఆ ఆనవాయితీ ప్రకారం నా అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ బలపరుస్తుందని ఆశించాను. కానీ కేసీఆర్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించి, కాంగ్రెస్కు సహకరించేది లేదని చెప్పకనే చెప్పారు' అని వి.హన్మంతరావు తెలిపారు. ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన గుండు సుధారాణి, వి.హన్మంతరావు పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
రాజ్యసభ బరి నుంచి కాంగ్రెస్ అవుట్
Published Sat, May 28 2016 1:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement