యాచారం(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్.. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కే ఇస్తామని, అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. యాచారం మండల పరిధిలోని మాల్ సర్పంచ్ చిన్నోళ్ల పద్మజ(టీఆర్‌ఎస్)తో పాటు పలువురు వార్డు సభ్యులు, 150 మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలు మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో పాటు అన్ని వర్గాల వారిని మోసం చేశారని మండిపడ్డారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేలు దీన్ని ధ్రువీకరించాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కూడా 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి, బహిష్కరణలకు గురైన వారితో చర్చించి సస్పెన్షన్ ఎత్తేసే విధంగా చూస్తున్నట్లు తెలిపారు. పార్టీ నుంచి విడిపోయిన ప్రతీ నాయకుడిని, కార్యకర్తను మళ్లీ ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పడకంటి శేఖర్‌గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాలె మల్లేశ్, ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా, నాయకలు ఆడాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment