సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా టీఆర్‌ఎస్ రాజకీయ వ్యూహాల జోరు పెంచింది. తెలంగాణ చట్టసభలలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా వేగంగా చర్చలు మొదలుపెట్టింది. మార్చి ఆఖరుతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రాతనిధ్యం లేకుండా పోతుంది. ఆరోజు వరకు అసెంబ్లీలోనూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకుని.. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. ఉపేందర్‌రెడ్డి గురువారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయ న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావుపై ఉపేందర్‌రెడ్డి విజయం సాధించారు. గెలిచినప్పటి నుంచే టీఆర్‌ఎస్ అధిష్టానంతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉపేందర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. ఆలోపు కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికార పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా.. ఒకట్రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలిసింది.
ఖమ్మంపై గులాబీ రెపరెపలు
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా విజయం నమోదు చేసుకున్న టీఆర్‌ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మం సెగ్మెంట్‌లోనే గెలిచింది. ఎన్నికలు కాగానే.. ఎమ్మెల్యేలు లావుడ్య రాములునాయక్, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
సీఎల్పీ విలీనం దిశగా..
శాసనమండలిలో అనుసరించిన ‘కాంగ్రెస్ సభాపక్షం విలీనం’ వ్యూహాన్నే శాసనసభలో నూ అమలు చేయాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులు ఉంటే ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనమవుతున్నట్లు శాసనమండలి చైర్మన్‌కు లేఖ ఇచ్చారు. దీంతో శానసమండలి కాంగ్రెస్ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైంది. కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు శాసనసభలోనూ ఇదే వ్యూహానికి రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు కైవసం చేసుకుంది.
వీరిలో 13మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు శాసనసభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. లోక్‌సభ ఎన్నికలలోపు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని టీఆర్‌ఎస్ వ్యూహాలు కదుపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సబితారెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్, ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమే. మరో ఏడుగురు ఇదేబాటలో నడిస్తే.. టీఆర్‌ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
ఖమ్మం పచ్చబడుతుందనే: ఉపేందర్‌రెడ్డి
కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు పాలేరు ఎమ్మెల్యే కందా ఉపేందర్‌రెడ్డి తెలి పారు. కేసీఆర్ నాయకత్వంలోనే ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. ఖమ్మం జిల్లా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పత్రికలకు ప్రకటన జారీ చేశారు. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. టీఆర్‌ఎస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అన్ని వర్గా ల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభి వృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా అవిరళ కృషి చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మొత్తం వ్యవసాయ భూమికి సాగునీరందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు. కరువు పీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా లో ప్రాజెక్టులన్నీ పూర్తయి, జిల్లా అంతా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం నాకు కలిగింది. ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నాను. టీఆర్‌ఎస్‌లో చేరి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment