
నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని...ఓ కానిస్టేబుల్..
నలుగురు ఆడ పిల్లలు పుట్టారని మరో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్‌పై అతని భార్యాపిల్లలు శుక్రవారం మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
నాంపల్లి (హైదరాబాద్): నలుగురు ఆడ పిల్లలు పుట్టారని మరో పెళ్లికి సిద్ధమైన కానిస్టేబుల్‌పై అతని భార్యాపిల్లలు శుక్రవారం మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అతడి నుంచి తమకు ప్రాణహాని ఉందని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేగంపేట్‌కు చెందిన కానిస్టేబుల్ నర్సింహులు, బాలలక్ష్మీ భార్యాభర్తలు. వీరికి నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. తమకు నలుగురూ ఆడ పిల్లలే పుట్టారని ఈ మధ్య కాలంలో భర్త నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడు.
సంతానంగా మగ పిల్లలు కావాలని మరో పెళ్లికి నర్సింహులు సిద్ధమయ్యాడు. భర్త మరో పెళ్లి చేసుకుంటే తాను, పిల్లలు రోడ్డున పడే ప్రమాదం ఉందని బాలలక్ష్మీ తెలిపింది. కాబట్టి భర్త నుంచి ప్రాణహాని లేకుండా తగిన రక్షణ కల్పించాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ ఆగస్టు 26వ తేదీలోగా సమగ్ర నివేదికను అందజేయాలని మెదక్ జిల్లా ఎస్పీని ఆదేశించింది.