అసలే కాలుష్యం.. ఆపై క్యుములోనింబస్‌! | contamination of that coin lumbos | Sakshi
Sakshi News home page

అసలే కాలుష్యం.. ఆపై క్యుములోనింబస్‌!

Published Fri, Sep 29 2017 2:05 AM | Last Updated on Fri, Sep 29 2017 9:22 AM

contamination of that coin lumbos

సాక్షి, హైదరాబాద్‌: అసలే వాహనాల పొగ, దుమ్ము, ధూళి, కాలుష్యం.. మరోవైపు దట్టంగా పరుచుకుంటున్న క్యుములోనింబస్‌ మేఘాలు.. సన్నగా, తరచూ కురుస్తూన్న ఉన్న వాన జల్లులు.. మొత్తంగా గ్రేటర్‌ హైదరాబాద్‌  ఉక్కిరిబిక్కిరవుతోంది. భూ ఉపరితలానికి కేవలం 0.9 కిలోమీటర్ల తక్కువ ఎత్తులోనే దట్టమైన క్యుములోనింబస్, నింబోస్ట్రేటస్‌ మేఘాలు ఏర్పడడంతో పట్టపగలే చీకటి కమ్ముకుంటోంది. దీంతో పొగ, దుమ్ము, కాలుష్యం వంటివి ఎక్కడికక్కడే నిలిచిపోయి.. ఊపిరాడని స్థితి నెలకొంటోంది. కాలుష్యం స్థాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనైతే జనం ఇక్కట్లుపడుతున్నారు. దాదాపు మూడు రోజులుగా నెలకొన్న ఈ పరిస్థితి కారణంగా.. అస్తమా, సైనస్‌ వంటి శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు సతమతమవుతున్నారు. ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్‌ మేఘాలతో నగర వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నట్లు బేగంపేట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు వెల్లడించారు. మరోవైపు క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో.. గురువారం హైదరాబాద్‌ వ్యాప్తంగా  ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు ఇదే  పరిస్థితి ఉంటుందని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు. ఈ నేపథ్యంలో.. జీహెచ్‌ఎంసీ అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

కాలుష్యం.. కారుమబ్బులు
హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో కాలుష్యం శ్రుతి మించుతోంది. పీఎం (పర్టిక్యులేట్‌ మేటర్‌) అవశేషాలు పెరిగిపోతున్నాయి. వాతావరణం సాధారణంగా ఉంటే దుమ్ము, ధూళి, పర్టిక్యులేట్‌ మేటర్‌ వంటివి భూ ఉపరితలంపై చేరిపోతాయి. వాహనాల పొగ, విష వాయువులు వాతావరణంలో కలసిపోతాయి. కానీ దట్టంగా మేఘాలు ఆవరించి ఉండడంతో వాతావరణం బంధించినట్లుగా మారిపోయింది. దీనికితోడు తరచూ వర్షం కురుస్తుండడంతో ఇబ్బందిగా మారింది. కాలుష్యాలు వర్షపు నీటిలో చేరడం, రోడ్లపైన నిలిచిన నీరు, చెత్తా చెదారం కారణంగా దుర్వాసన వంటివి దీనికి తోడయ్యాయి. వీటన్నింటి మధ్యా ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది.

కోరలు చాస్తున్న కాలుష్యం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాలుష్యం మోతాదుకు మించి నమోదవుతోంది. సుమారు 45 లక్షలకుపైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, రహదారులపై రేగుతున్న దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యి. ఘనపు మీటరు గాలిలో ధూళికణాలు (పీఎం 10) మోతాదు 60 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ పలు చోట్ల అంతకు రెట్టింపు స్థాయిలో ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్‌ ప్రాంతాల్లో వాయు కాలుష్యం శ్రుతి మించినట్లు తేలింది.

కాలుష్యానికి కారణాలెన్నో..
► గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోల్, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తారని అంచనా. దీంతో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. వీటితోనూ ఇబ్బందే.
►వాహనాల సంఖ్యతో రహదారులు సరిపోక.. ట్రాఫిక్‌ రద్దీ పెరుతోంది. దాంతో ఇంధన వినియోగం పెరగడంతోపాటు దుమ్ము, ధూళి ఎగసిపడుతున్నాయి.
►శివార్లలోను ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం పెరిగిపోతోంది.

కాలుష్య ఉద్గారాలతో అనర్థాలివే..

► వాతావరణంలో చేరే విష వాయువులు, దుమ్ము, ధూళి వంటి వాటి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
►  టోలిన్, బెంజీన్‌ వంటి కలుషితాల ద్వారా కేన్సర్, రక్తహీనత, టీబీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
► సల్ఫర్‌ డయాక్సైడ్‌ శ్వాసకోశాలకు చికాకు కలిగించి బ్రాంకైటిస్‌కు కారణమవుతోంది.
►  నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కారణంగా కళ్లు, ముక్కు మండుతాయి. ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుంది.
►  అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్లమంట, శ్వాస వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది.
►  పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం ధూళి రేణువులు ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన వ్యాధులు వస్తాయి. కేన్సర్‌ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక పర్టిక్యులేట్‌ మేటర్‌ కళ్లలోకి చేరడంతో కంటి సమస్యలు తలెత్తుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement