అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలి | Continue profession with self respect | Sakshi
Sakshi News home page

అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలి

Published Sat, Jun 13 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలి

అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలి

- పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి
- బార్ అసోసియేషన్ వార్షిక వేడుకలు షురూ
వరంగల్ లీగల్ :
న్యాయవాదులు అత్మగౌరవంతో వృత్తిలో కొనసాగాలని, ధనాపేక్ష రుగ్మతలకు మూలమని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి అన్నారు. బార్ అసోసియేషన్ వార్షికోత్సవం జిల్లా నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింస వంటి విలువలు పాటించడం కష్టమని, అయితే ఆచరించిన వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. న్యాయవాదులు కక్షిదారుడిని వదులుకోవద్దని, న్యాయమూర్తులు న్యాయస్థానాలపై గౌరవంతో ఉండాలని సూచించారు.

విశిష్ట అతిథిగా హాజరైన భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పర్యాద అంజిరెడ్డి సాధారణ రైతు వేషధారణ అయిన తలపాగాతో  విశేషంగా అకట్టుకున్నారు.ఆయన మాట్లాడుతూ అవసరం ఉన్నంత సంపాదించాలనే నానుడి స్థానంలో అవతలి వాడికంటే ఎక్కువ సంపాదించాలని వచ్చిందని వ్యంగ్య చలోక్తులు విసిరారు. ఒక్కనాడు గ్రామ స్వరాజ్యంలో విరిసిన రోజు న్యాయం ఉండేదని... నేడు న్యాయాన్ని కొనుక్కోవాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రతి చట్టం మాతృభాషలో ఉండాలని ,సగటు కక్షిదారుడికి న్యాయస్థానంలో ఏమి జరుగుతుందో తెలియనంత వరకు అన్యాయం జరిగినట్లుగానే భావించాలన్నారు. సమాజ హితం కోసం అన్ని శాస్త్రాలు పనిచేయాలని, కానీ దేశానికి వెన్నముక అయిన రైతుకు స్వాతంత్య్రం రాలేదన్నారు.

పత్తి పంటకు నిలయమైన ఓరుగల్లులో విత్తనాలు, పురుగు మందుల వ్యాపారులు, పత్తి మిల్లు యాజమానులు ధనవంతులైతే రైతులు మాత్రం అత్మహత్యలు చేసుకుంటున్నారని... ఈ స్థితికి కారణాలు వెలికి తీయాలని న్యాయవాదులకు అంజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.సహోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పల్లా మహాత్మ, ఉపాధ్యక్షులు ఇ.అనంద్‌మోహన్, సహాయ కార్యదర్శి పత్తిపాటి శ్రీనివాసరావు, మహిళా కార్యదర్శి నారగొని సునీత, కోశాధికారి డేవిడ్ రాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు దేవేందర్, శివకుమార్, శివరామకృష్ణ, మురళీ, సంతోష్, సంపత్‌రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మహిళా కార్యవర్గ సభ్యులు గౌసియా బేగం పాల్గొన్నారు. న్యాయవాదులు నిర్వహించిన క్రీడా సాంస్క­ృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డి, రైతు నాయకుడు అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. తాడూరి రేణుక శిష్య బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement