ఏడాది పొడవునా నిరంతర విద్యుత్
* ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి
* భారీ పెట్టుబడులతో విద్యుత్‌రంగంలో మౌలిక సదుపాయాలు
* వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల సరఫరా
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి పేర్కొన్నారు. భారీ పెట్టుబడులతో విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏడాది పొడవునా నిరంతర విద్యుత్ సరఫరా కోసం తాత్కాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు.
అత్యవసరమైన సందర్భాల్లో పవర్ ఎక్సేంజి నుంచి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ సరఫరాకోసం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.680 కోట్లతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం కింద నీటిని అందించడానికి కావాల్సిన 104.05 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం రూ.48.91 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 2015-16 మధ్యకాలంలో ఎలాంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేశామన్నారు. గతంలో మూతబడిన పరిశ్రమలు తెరుచుకోవడంతో ఏడాది కాలంలో విద్యుత్ డిమాండ్ అమాంతంగా పెరిగిందన్నారు. గత మార్చి 2న గ్రేటర్ పరిధిలో 38.06 మిలియన్ యూనిట్లు(ఎంయూ)గా ఉన్న వినియోగం సరిగ్గా ఏడాది తర్వాత ఇదే తేదీనాటికి 46.38 ఎంయూలకు పెరిగిందన్నారు.
సమస్యలుంటే సంప్రదించండి...
2013-14, 2014-15 తొలి అర్ధవార్షికంలో గృహ, ఇతర వినియోగదారులకు 4-8 గంటలు, పరిశ్రమలకు వారంలో ఓ రోజు విద్యుత్ కోతలు పెట్టేవారని రఘుమారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులను చక్కదిద్ది కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేస్తున్నామన్నారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్యపైనైనా www. tssouthernpower.com వెబ్‌సైట్‌లోని 'Contact Us' ద్వారా క్షేత్ర స్థాయి అధికారులను సంప్రదించాలని ఆయన వినియోగదారులకు సూచించారు. ఈ లింకు ద్వారా క్షేత్ర స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల నంబర్లను తెలుసుకోవచ్చన్నారు. అయినా, సమస్య పరిష్కారం కానిపక్షంలో customerservice@tssouthernpower.comకు మెయిల్ చేయాలని కోరారు.