సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివాదాస్పద భూముల లెక్క ఎట్టకేలకు తేలింది. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో పది లక్షల ఎకరాలు వివాదాల్లో ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. కోర్టు కేసులు, అటవీ శాఖతో ఉన్న వివాదాలు, భూబదలాయింపు క్రమబద్ధీకరణ, వ్యక్తిగత వివాదాలున్న భూములను కేటగిరీల వారీగా లెక్కగట్టి ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ గణాంకాలను ప్రభుత్వానికి సమర్పించింది. రెవెన్యూ శాఖ లెక్క ప్రకారం 5 లక్షలకుపైగా ఎకరాలకు వ్యక్తిగత వివాదాలుండటం గమనార్హం.
ఆరు నెలలకు పైగానే..
భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియలో భాగంగా రెవెన్యూ రికార్డుల సవరణలు, మార్పులు, చేర్పులు జరిగాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా ఈ సవరణల గణాంకాలను కూర్పు చేసి ఆరునెలలకుపైగా సమయం తీసుకున్న తర్వాత వివాదాస్పద భూములను రెవెన్యూ యంత్రాంగం నిర్థారించింది. ఈ గణాంకాల ప్రకారం.. సివిల్ కోర్టుల్లో 1,11,196 ఎకరాలు, రెవెన్యూ కోర్టుల్లో 42,318 ఎకరాలకు సంబంధించి భూవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక, ఇలా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య పంచాయితీ ఉన్న భూమి 2,04,729 ఎకరాలని తేలింది. వీటికి తోడు భూబదలాయింపు క్రమబద్ధీకరణ(ఎల్‌టీఆర్)æ(ఒకరి చేతిలో ఉన్న భూమి ఇంకొకరికి బదలాయింపు చేసి దానిని క్రమబద్ధీకరించడం) కింద రాష్ట్రవ్యాప్తంగా 95,214 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయి. అన్నింటికన్నా ఎక్కువగా అన్నదమ్ములు, వారసులు, బంధువులు, సరిహద్దుల్లో భూములున్న వారితో వివాదాలున్న భూములు 5,84,527 ఎకరాలున్నాయని తేలింది.
ఆ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ
జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 33,121 ఎకరాల్లో అటవీశాఖతో వివాదం ఉన్న భూములు తేలాయి. మంచిర్యాల, కామారెడ్డి, మహబూ బాబాద్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అటవీశాఖతో వివాదాలున్న భూములు ఎక్కు వగా ఉన్నాయని తేలింది. కోర్టు కేసుల విష యానికి వస్తే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 17,118 ఎకరాల వివాదాలు సివిల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో సివిల్ కోర్టుల్లో ఉన్న భూములు 243 ఎకరాలే.
ఎల్‌టీఆర్ కేటగిరీలో రాష్ట్రవ్యాప్తంగా 95 వేల ఎకరాలకుపైగా వివాదాలుంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 75,987 ఎకరాలుండటం విశేషం. రాష్ట్రంలోని 30 గ్రామీణ జిల్లాలకుగానూ 19 జిల్లాల్లో ఎల్‌టీఆర్ కేసులు ఒక్కటీ నమోదు కాలేదు. వ్యక్తిగత వివాదాలున్న భూముల విషయానికి వస్తే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 53,033 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 41,463 ఎకరాల్లో వివాదాలున్నాయి. వివాదాస్పద భూములన్నింటినీ పార్ట్–బీ కేటగిరీలో చేర్చిన రెవెన్యూ యంత్రాంగం.. కోర్టుల్లో ఉన్న భూములు మినహా మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment