
'హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను పంపేందుకు కుట్ర!'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న చేపట్టనున్న సమగ్ర సర్వేపై మరోసారి వివాదం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులను పంపేందుకు కుట్ర పన్నే సర్వే చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సర్వే వెనుక దురుద్దేశం ఉందని చెప్పారు.
సీమాంధ్రకు చెందిన లక్షమంది విద్యార్థులు, 55 వేల మంది ఉద్యోగులను హైదరాబాద్ నుంచి పంపేందుకు సర్వే చేస్తున్నట్టుగా సీఎం పేషీలోని పీఆర్వో విజయ్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్న వీడియోను టీడీపీ విడుదల చేసింది. తెలంగాణ సమగ్ర సర్వేకు సంబంధించిన ఈ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సర్వేకు సంబంధించి కొన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం పేషీ అధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి వచ్చే అవకాశముంది. విజయ్ వ్యాఖ్యలను టీడీపీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది.