హైదరాబాద్, కర్ణాటక మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల పొరపాటుతో జరిగిన ఒక ఘటన వివాదానికి కారణమైంది. కర్నాటక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండో ఓవర్ నాలుగో బంతిని ఆపే ప్రయత్నంలో హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ బౌండరీని తాకాడు. అయితే దీనిని గుర్తించని ఫీల్డ్ అంపైర్లు రెండు పరుగులు మాత్రమే ఇచ్చారు. ఇన్నింగ్స్ ముగిశాక హైదరాబాద్ 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ఆట ఆరంభానికి ముందు కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కర్ణాటక జట్టు స్కోరులో మరో రెండు పరుగులు అదనంగా చేర్చారు. ఈ విష యం హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌కు ఆట మధ్యలో తెలిసింది. దాంతో కెప్టెన్ అంబటి రాయుడు అంపైర్లతో వాదనకు దిగాడు.
మరోవైపు వినయ్ కుమార్ కూడా మైదానంలోకి వచ్చి అంపైర్లతో చర్చించాడు. అయితే హైదరాబాద్ వాదనను పట్టించుకోని అంపైర్లు ఆటను కొనసాగించారు. చివరకు హైదరాబాద్ కూడా సరిగ్గా 203 పరుగులే చేయడంతో ఆ పరుగుల ప్రాధాన్యం పెరిగింది. రాయుడు సూపర్ ఓవర్ ఆడించమని కోరగా...అంపైర్లు అంగీకరించకుండా కర్ణాటకను విజేతగా ప్రకటించారు. మ్యాచ్ ముగిశాక కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానం వీడకపోవడంతో తర్వాత జరగాల్సిన ఆంధ్ర, కేరళ మ్యాచ్ ఆలస్యమై చివరకు 13 ఓవర్లకు పరిమితం చేయాల్సి వచ్చింది. ‘నాకు నిబంధనల గురించి బాగా తెలుసు. అప్పుడే అంపైర్లు ఫోర్‌గా ప్రకటిస్తే సమస్య ఉండకపోయేది. మాకు లక్ష్యం నిర్దేశించాక 2 పరుగులు ఎలా కలుపుతారు. ఒక సారి బ్యాట్స్‌మన్ అవుటై పెవిలియన్ చేరాక అది నాటౌట్‌గా తేలినా, అది నో బాల్ అయినా మళ్లీ వెనక్కి పిలవరు కదా’ అని రాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై హైదరాబాద్ జట్టు రిఫరీకి ఫిర్యాదు చేసింది.
ఈ వివాదం మా దృష్టికి వచ్చింది. మ్యాచ్ రిఫరీ అధికారిక నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత బోర్డు క్రమశిక్షణా నియమావళి ప్రకారం తగిన చర్య తీసుకుంటాం’ – బీసీసీఐ ప్రకటన
మైదానంలో వివాదం!
Published Fri, Jan 12 2018 12:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment