సమన్వయంతో సాగుదాం | Coordinated | Sakshi
Sakshi News home page

సమన్వయంతో సాగుదాం

Published Mon, Dec 15 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM

Coordinated

కొట్లాడి తెలంగాణ సాధించుకున్నం... పాత ప్రభుత్వ పాలన వేరు.  తెలంగాణ ప్రభుత్వ పాలన వేరు. కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రజాప్రతినిధులతో అధికారులు సమన్వయంతో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవగాహన లేదు. అధికారులే అవగాహన కలిగించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను ఖర్చు పెట్టడంలో మన జిల్లా దేశానికే దిక్సూచి కావాలి. సమస్యలుంటే నా సెల్‌కు ఫోన్ చేయండి. ఎత్తకుంటే ఎస్‌ఎంఎస్ కొట్టండి.
 - వినోద్‌కుమార్, కరీంనగర్ ఎంపీ, విజిలెన్స్
 మానిటరింగ్ కమిటీ చైర్మన్
 
 ప్రభుత్వం ఎడ్లబండి అయితే మనం(అధికారులు, ప్రజాప్రతినిధులు) జోడెడ్లం.. సమన్వయంతోనే అభివృద్ధి చేసుకుందాం. కేంద్ర ప్రభు త్వ పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలి. ఆరునెలలవుతున్నా ఇక్కడున్న అధికారులెవరూ నాకు తెలియదు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అ వసరముంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం. సమస్యలపై ఎ ప్పటికప్పుడు స్థానిక నేతల దృష్టికి తీసుకెళ్లాలి.
 - బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ,
 కమిటీ కో చైర్మన్
 
 అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది.  నిధుల విని యోగంలో దేశానికే జిల్లా దిక్చూచిలా ఉండేలా చూడాలని సూచించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహించిన ఈ సమావేశంలో 14 పథకాలపై నాలుగు గంటల పాటు సమీక్షించారు. పథకాల ప్రగతిపై పలువురు ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.        
 - ముకరంపుర
 
 ముకరంపుర : కమిటీ చైర్మన్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఉద యం 11 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా గంట ఆలస్యమైంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమీక్షించారు. వాస్తవంగా ఏటా మూడుసార్లు విజిలెన్స్ మానిట రింగ్ కమిటీ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. సమావేశం నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు ఆగిపోయే అవకాశమున్నందున అత్యవసరంగా ఏర్పాటు చేసినట్లు ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. జనవరిలో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఆయా ప్రాంతాల్లో పథకాల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 ఉపాధి పనుల్లో కూలీలకు తక్కువ పనిదినాలపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జారీ చేసిన జాబ్‌కార్డులకు పనిదినాలకు వ్యత్యాసాన్ని డ్వామా ఇన్‌చార్జి పీడీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, మొక్కలపెంపకంలో ప్రగతి గతి తప్పిందని అసహనం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించడంలో జాప్యంతోనే పథకం వెనుకంజలో ఉందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ లేవనెత్తారు. జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీపీలు సైతం ఇదే విషయాన్ని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మార్చి 31లోగా పూర్తయిన వాటికి బిల్లులు చెల్లించినట్లు డ్వామా ఇన్‌చార్జి పీడీ శ్రీనివాస్ తెలిపారు. సాంక్షన్ లేకుండా నిర్మాణాలు చేసిన వాటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
 
 పెద్దపల్లి, మంథని ప్రాంతంలో చేపట్టిన 105 కిలోమీటర్ల రింగురోడ్డు పూర్తి చేయడానికి ఓ పెద్దాయన అడ్డుకుంటున్నారని, స్టేజ్ టూ వర్క్ మొదలుపెట్టనివ్వడం లేదని, ఇంకా 55 కిలోమీటర్ల రోడ్డు పెండింగ్‌లో ఉందని ఆర్‌అం డ్‌బీ ఎస్‌ఈ చందూలాల్ పేర్కొన్నారు. ఈ విషయం డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలి పారు. నాణ్యమైన పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని, త క్కువ కోట్ చేసే టెండర్‌దారుల నుంచి డిపాజిట్లు పెట్టేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.
 
 ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఖర్చు చేసే నిధులు కాంట్రాక్టర్ల ఉపాధికే పరిమితమవుతున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం కావటం లేదన్నారు. పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు ఆకర్షించలేకపోతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులకు నామమాత్రమైన శిక్షణలతో సరిపుచ్చుతున్నారని పేర్కొన్నారు. రేషనలైజేషన్ లేదని, 2013లో బదిలీ అయిన టీచర్లు రిలీవ్ కాలేదని, సర్దుబాటుపై డీఈవో స్పందించడం లేదని అన్నారు. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వ పాలసీ వెల్లడైన అనంతరం అసలు కథ ఉంటుందని ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. కేజీటూ పీజీ విద్యావిధానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి పాఠశాలలు మండలానికొకటి తెస్తామన్నారు.
 
 ఆ మిషన్లు ఏమయ్యాయి?
 మహిళల్లో క్యాన్సర్ కారకాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, శానిటరీ నాఫ్‌కిన్స్ తయారీలో పూర్తిగా వైపల్యం చెందిందని ఎంపీ వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రెండు మండలాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి రూ.3 కోట్లతో తెచ్చిన మిషన్లను నిరుపయోగంగా గదుల్లో వేసి తాళం వేశారని అన్నారు. ఈ విషయమై సంబంధిత డీఎంహెచ్‌వో అలీం మాట్లాడుతూ ఆ మిషన్ విలువ రూ.2.44 లక్షలని మాత్రమే నివేదికలో ఉందన్నారు. వెంటనే ఆరా తీసి నివేదికలు సమర్పించాలని ఎంపీ ఆదేశించారు.  జిల్లాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని, అవసరమైతే మరిన్ని ఎంపీ నిధులను కూడా మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేసేలా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని తెలిపారు. ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్, సీపీవో సుబ్బారావు, టీఎస్‌ఎంఐపీ పీడీ సంగీతలక్ష్మి, జడ్పీ సీఈవో అంబయ్య, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
 అవగాహనలు.. అసంతృప్తులు
 కేంద్రప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమవేశంలోనే పలువురు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగింది. అసలు తనకేమీ తెలియడం లేదని స్వయంగా పెద్దపెల్లి ఎంపీ బాల్కసుమన్ చెప్పడం విశేషం. కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు కూడా అధికారులు చెప్పే విషయాలను క్షుణ్ణంగా విన్నారు. వివిధ పథకాలపై జరిగిన సమీక్షలో ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఏఏవై పథకం కింద గ్రామాలలో మైనార్టీలకు చెందిన గృహాల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకా రూ.4 కోట్ల నిధులు మిగిలాయని, సంబంధిత ప్రజాప్రతినిధుల సహాకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. నాలుగు మండలాల్లోని గ్రామాలకు రూ.24.97 కోట్లు వాటర్‌షెడ్ పథకానికి రెండు నెలల క్రితం మంజూరు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లోని అక్కన్నపేట, భీమదేవరపల్లిలోని గట్లనర్సింగాపూర్, సిరిసిల్లలోని తాడూర్, బెజ్జంకిలోని దాచారం గ్రామాలకు దాదాపు రూ.7 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
 
  వాటర్ షెడ్ పనుల కోసం వచ్చే నిధులు 90 శాతం దుర్వినియోగమవుతున్నాయని, అధికారులు జల సంరక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధితోపాటు వారు ఎదర్కుంటున్న సాంఘిక సమస్యలపై దృష్టిసారించాలన్నారు. గ్రామీణ విద్యుదీకరణ పథకం పూర్తిప్రణాళిక నివేదిక ప్రతిని తనకు అందజేయాలని ఎస్‌ఈకి సూచించారు. మోడ ల్ స్కూళ్లలో నిబంధనలను అనుసరించి విద్యార్థుల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం మెరుగుదలకు తగిన సూచనలు అందించాలని డీఈవోను కోరారు. వచ్చే సమావేశంలో చర్చలుండవని, చర్యలు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేశారని, ఈ సారి గంపగుత్తగా కేంద్రమిచ్చే నిధులను ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగమైతే సహించేది లేదన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement