సాక్షి, హైదరాబాద్: కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు.. ‘కరోనా’ లాక్‌డౌన్‌తో అవన్నీ కరువయ్యాయి. రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజల పరిస్థితి కష్టంగా మారింది.. ఇంతకాలం ఏదో ఒక పని చేస్తూ వారు సంతృప్తిగా జీవనం సాగించారు. పొద్దంతా కష్టపడగా వచ్చిన దానితోనే కుటుంబాన్ని సాకుతూ ఆనందంగా కాలం గడిపేవారు. అలాంటి వారిపై ఒక్కసారి కరోనా మహమ్మారి పిడుగై వచ్చిపడింది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో బయటకు వెళ్లి ఏ పనిచేసుకునే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఉందామంటే జీవనం కష్టమైంది. ప్రస్తుతం చేస్తున్న పనినే కొనసాగిద్దామంటే అనుమతి లేదు. దీంతో కరోనా వైరస్‌పై ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు టీ విక్రయిస్తూ వచ్చినదాంతో కాలం వెళ్లదీస్తున్నారు.
పానీపూరి బండినే కూరగాయల బండి చేశా..
‘రోజూ ఉదయం పూట అన్ని వస్తువులు, సాయంత్రం పానీపూరి అమ్మేవాడిని. ప్రస్తుతం కరోనాతో అవి అమ్ముదామంటే అన్ని షాపులు మూతపడ్డాయి. ఉన్నవి కూడా అమ్మే పరిస్థితి లేదు. ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించినప్పుడు కూరగాయల కోసం బయటకెళ్లా.. కూరగాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూశా.. దీంతో ప్రజలకు ఇంటింటికీ వెళ్లి కూరగాయలు అమ్మాలనుకున్నా. నా పానీపూరి బండిని కూరగాయల బండిలా చేసి రోజూ కూరగాయలు అమ్ముతున్నా...’
– దత్తు
టీ అమ్ముతున్నా..
‘ప్లంబర్ వర్క్ చేస్తూ జీవనం కొనసాగించేవాడిని. అయితే కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో పని కరువైంది. కనీసం ఎవరూ బయటకు వెళ్లని పరిస్థితి. ఇతరులకు ఇబ్బంది లేకుండా, ముఖానికి మాస్క్ ధరించి, చేతులకు గ్లౌజ్‌లు ధరించి ఉదయం సమయంలో టీ అమ్మాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో టీ తయారు చేసి అమ్ముతున్నాను. కొంత మేర ఆదాయం వస్తోంది..’
– బాబా
Comments
Please login to add a commentAdd a comment