1918 మార్చి.. స్పానిష్ వైరస్ దాదాపు 20 లక్షల మందిని బలి తీసుకుంది.. ఆరు నెలల తర్వాత ఏకంగా 4 కోట్ల మందిని చంపేసింది. మరో ఆరు నెలల తర్వాత 60 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ లెక్కలకు పక్కాగా రికార్డులు లేనప్పటికీ, అంతర్జాతీయ అధ్యయనాలు కాస్త అటూ ఇటుగా తేల్చిన అంకెలివి. మన దేశంలో మొత్తం కోటిన్నర మంది చనిపోతే, అందులో రెండో విడత సమయంలో కోటి మంది బలయ్యారట. ఆ సమయంలో జరిగిన మొదటి ప్రపంచయుద్ధం దాదాపు 2 కోట్ల మందిని బలితీసుకుంటే మూడు విడతల్లో విరుచుకుపడ్డ వైరస్ అంతకు రెండు రెట్ల కంటే ఎక్కువ మందిని అంతం చేసింది. విడతలవారీగా విరుచుకుపడితే వైరస్ చూపే మారణహోమం ఇలా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా (కోవిడ్–19) కూడా ఇలాగే రెండోసారి విరుచుకుపడితే ఏమవుతుందో అని జనాలు భయపడుతున్నారు. అయితే, అప్పుడు వైరస్ కట్టడిలో ప్రజలకు అవగాహన అతి తక్కువని, ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దూకుడు ప్రస్తుతం కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల పాజిటివ్ కేసులు రెట్టింపయ్యే సమయం బాగా పెరిగింది. క్రమంగా వైరస్ ప్రభావం తగ్గి మరో నెల రోజుల్లో పరిస్థితి మామూలుగా మారే అవకాశం ఉందనేది ఎక్కువ మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నిజంగా వైరస్ దూకుడు తగ్గినట్టేనా..? అంటే కచ్చితంగా చెప్పలేప్పటికీ ప్రభావం మాత్రం తగ్గుతోందని స్పష్టమవుతోంది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి రెండోసారి కూడా విరుచుకుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ రెండో వేవ్ రాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా పేర్కొంది. అయితే, దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, శరీరంలో రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకుంటే రెండో వేవ్‌లో కరోనా ప్రభావం తక్కువే ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వందేళ్ల క్రితం ఏం జరిగింది..?
వందేళ్ల క్రితం విరుచుకుపడ్డ స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా దాదాపు మూడున్నర కోట్ల మందిని బలితీసుకుందని అంచనా. 1918లో పంజా విసిరిన ఈ మహమ్మారి మూడు విడతలుగా విరుచుకుపడింది. ఇందులో రెండో దఫా కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టించింది. ఈ వైరస్ తొలుత స్పెయిన్‌లో వెలుగు చూడటంతో దానికి స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా అని పేరు పెట్టారు. అయితే, ఆ వైరస్ ముందు అమెరికాలో పుట్టిందని బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. 1918 మార్చి ప్రారంభంలో అమెరికాలోని కెన్సాస్‌లో ఈ వైరస్ పురుడు పోసుకుందని అది వివరించింది. అక్కడి నుంచి మొదటి ప్రపంచయుద్ధం కోసం పశ్చిమ యూరప్‌కు వెళ్లిన అమెరికా సైనికులతో ఆ వైరస్ యూరప్‌లోకి చేరింది. జూలైలో పోలండ్‌కు పాకింది. ఇది మొదటి వేవ్. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణనష్టం చాలా తక్కువగా నమోదైంది. దీన్ని గుర్తించేసరికే ఆ తొలి విడత అంతమైంది. చదవండి: జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా..
రెండో విడతలో విధ్వంసం
స్పానిష్ వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది రెండో వేవ్‌లోనే. తొలి విడత అంతమైన తర్వాత కొన్ని నెలలకే అది మళ్లీ విరుచుకుపడింది. అమెరికాలోని కెన్సాస్ ప్రాంతంలో మళ్లీ ఉనికి కనిపించిన తర్వాత ఆరు రోజుల్లోనే ఏకంగా 6650 మంది పాజిటివ్‌గా తేలారు. చూస్తుండగానే ఒక్క అమెరికాలోనే ఆరు లక్షల మంది చనిపోయారు. మొదటి విడతలో ఎక్కువగా వృద్దులు దీనిబారిన పడగా.. రెండో విడతలో మధ్య వయస్సువారు ఎక్కువగా ప్రభావితులయ్యారు. భారత్‌లో 1918 మేలో తొలిసారి ఆ వైరస్ కనిపించి కొద్ది రోజులే ప్రభావం చూపింది. కానీ అక్టోబర్‌లో అది విరుచుకుపడింది. నవంబర్‌లో ఉత్తరభారతమంతా వ్యాపించింది. డిసెంబర్ నాటికి బెంగాల్‌ను శవాలగుట్టగా మార్చేంది. మన దేశంలో దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ వైరస్ తగ్గుముఖం పట్టింది.
మళ్లీ 2019 ఏప్రిల్‌లో మూడోసారి వెలుగు చూసింది. మొదటి విడత ప్రభావం పెద్దగా లేకపోయేసరికి జనం మేల్కొనలేదు. రెండోసారి విరుచుకుపడేసరికి సన్నద్ధంగా లేకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నారు. రెండోసారి తీవ్ర ప్రభావం చూపటంతో భౌతికదూరం విధానానికి శ్రీకారం చుట్టారు. మూడోవిడత వచ్చే సరికి ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో ప్రభావం కొంతే కనిపించింది. ప్రస్తుతం ఈ వైరస్‌తో కరోనాను పోల్చి చూస్తున్నందున, ఇది కూడా రెండోవిడత విరుచుకుపడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, దక్షిణ కొరియాల్లో మళ్లీ అది తిరగబెట్టిన దాఖలాలు ఉండటంతో పలువురు రెండో వేవ్ గురించి ఆందోళన చెందుతున్నారు.
అలవాట్లలో మార్పులు అవసరం
‘వైరస్‌లు ఒకసారితో వెళ్లిపోవటం లేదు. స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా తరహాలో కరోనా కూడా మళ్లీ విరుచుకుపడొచ్చు. అది ఎప్పుడో చెప్పలేం. ఈలోపు వ్యాక్సిన్ సిద్ధమైతే ఇబ్బంది ఉండదు. కానీ, కొన్ని సందర్భాల్లో వైరస్ రెండోసారి రూపు మార్చుకుని రావచ్చు. అప్పుడు ఈ వ్యాక్సిన్ అంతగా పనిచేయదు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. భౌతికదూరం, మాస్కుల వాడకం, తరచూ చేతులు కడుక్కోవటం వంటి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలి. తొందరలో మందులు అందుబాటులోకి రావచ్చు. దీంతో బాధితులకు ప్రాణహాని తప్పుతుంది. కానీ వైరస్ సోకకుండా ఉండాలంటే మన అలవాట్లలో చాలా మార్పులు అవసరం’
డాక్టర్ రాజారెడ్డి, సీనియర్ సర్జన్
రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకుంటే చాలు
‘కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. అల్లోపతి మందులు ఎప్పుడు సిద్ధమవుతాయో చెప్పలేం. అవి లేవు కదా అని వైరస్ చూస్తూ ఊరుకోదు. రెండో విడత రావాలంటే విరుచుకుపడే తీరుతుంది. అలా అని మనం భయపడుతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ప్రతి ఒక్కరు తమ రోగనిరోధక శక్తిని తగిన విధంగా మార్చుకోగలగాలి. మనకు అందుబాటులో ఉండే.. పసుపు, లవంగాలు, దాల్చిని, గ్రీన్ టీ, శొంఠి, మెంతికూర, వెల్లుల్లి, దబ్బకాయి, ఉల్లి, ఉసిరి, నల్ల ద్రాక్ష వంటి వాటితోపాటు మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. దీంతోపాటు వావిలి, నేలవాములాంటి వాటితో రూపొందిన మందులు కూడా ఉపయోగపడతాయి’
- డాక్టర్ సునీల్, ఇంటిగ్రేటివ్ మెడికల్ స్పెషలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment