కరోనా : 40 రోజుల బతుకు లాక్‌డౌన్‌ | Corona Virus Destroyed Poor People Livelihoods | Sakshi
Sakshi News home page

కరోనా : 40 రోజుల బతుకు లాక్‌డౌన్‌

Published Thu, Apr 30 2020 2:08 AM | Last Updated on Thu, Apr 30 2020 6:41 AM

Corona Virus Destroyed Poor People Livelihoods - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌.. రెక్కాడితే డొక్కాడని నిరుపేద, పేదల బతుకులను ఛిద్రం చేసింది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలు సమీప భవిష్యత్తులో కోలుకోలేనంతగా చావు దెబ్బకొట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. కరోనా వైరస్‌ నియంత్రణకు  విధించిన జనతా కర్ఫ్యూతో కలిపి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చి గురువారానికి 40 రోజులు పూర్తవుతోంది. పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ మూతబడి ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రాష్ట్రం స్తంభించింది. దీంతో సంపాదన లేక ప్రజల బతుకు బండి భారంగా మారింది.

ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కొనసాగింపు లేదా ముగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం కోసం ప్రజలు, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. మే 3న దేశంలో, 7న రాష్ట్రంలో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. కరోనా నియంత్రణలో పురోగతి ఆధారంగా ఆ తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మే 5న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై లాక్‌డౌన్‌ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఆ రోజు సీఎం చేసే ప్రకటన కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.  

సహాయం కోసం ఆర్తనాదాలు.. 
తెల్లరేషన్‌కార్డు కలిగిన పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.1,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం ద్వారా కొంత వరకు ఉపశమనం కలిగించింది. అయితే, రాష్ట్రంలో లక్షల పేద కుటుంబాలకు రేషన్‌కార్డులు లేవు. పిల్లాజెల్లాతో పాటు తమ ఆకలి తీర్చుకొని ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఇలాంటి నిర్భాగ్యులు ఏ పూటకు ఆ పూట దయార్థ హృదయులైన దాతల రాక కోసం నిరీక్షిస్తున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తే కడుపు నింపుకొంటున్నారు. లేకుంటే పస్తులు తప్పడంలేదు. ఇక దిగువ మధ్యతరగతి, చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలూ తీవ్రంగా కుంగిపోయాయి.

దాదాపు 40 రోజులుగా ఎలాంటి సంపాదన లేకుండా ఇంట్లో కూర్చొని తినడంతో కష్టకాలంలో ఉపయోగపడతాయనుకుని దాచిపెట్టుకున్న డబ్బులు సైతం ఖర్చయి పోయాయి. నగరంలో ప్రైవేటు ఉద్యోగాలు, చిన్నచిన్న వ్యాపాలు చేసే మధ్యతరగతి కుటుంబాల వ్యక్తులు.. తమ ఇళ్లల్లో కిరాణా సామగ్రి అయిపోయిందని, డబ్బులు లేవని, ఎవరైనా ఆదుకోకపోతే తమ కుటుంబాలకు ఆకలి చావులు తప్పవని పేర్కొంటూ ట్వీటర్‌లో అర్థిస్తున్నారు. లాక్‌డౌన్‌తో సంపాదన లేక తమ కుటుంబాలను పోషించడానికి తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తుల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో మంత్రి కె.తారకరామారావుకు ట్వీటర్‌లో విజ్ఞప్తులు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించి వీరికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.  చదవండి: దమ్ముంటే పాతబస్తీకి వెళ్లి చూడాలి

సర్కారుకు దినదిన గండం  

కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు రోజువారీ పరిపాలన వ్యవహారాలను కొనసాగించడానికి అవసరమైన ఖర్చులకు నిధులు లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలుకు సైతం ప్రభుత్వం తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఒక విధంగా ప్రభుత్వం దినదిన గండాన్ని ఎదుర్కొంటోందని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. లాక్‌డౌన్‌ వల్ల పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతబడటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దాదాపు సున్నాకు చేరింది. జీఎస్టీ, వ్యాట్‌ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి రోజూ రూ.350 నుంచి 400 కోట్లు చొప్పున నెలకు దాదాపు రూ.10వేల కోట్ల నుంచి 12వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉంది. ప్రధానంగా మద్యంపై విధించే జీఎస్టీ, వ్యాట్‌ రూపంలోనే ప్రతి నెలా రూ.3వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది.

మొత్తమ్మీద జీఎస్టీ, వ్యాట్‌ రూపంలో ప్రభుత్వానికి గడిచిన 40 రోజుల్లో సుమారు రూ.16 వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.500 కోట్లు మాత్రమే వచ్చాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించడానికి రూ.2,500 కోట్లు, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్ల పంపిణీకి రూ.4 వేల కోట్లు, 87.54 లక్షల పేద కుటుంబాలకు రేషన్‌ బియ్యం పంపిణీకి రూ.550 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం నుంచి 50 వరకు కోత పెట్టి (చెల్లింపును వాయిదా వేసి), నిరుపేదలైన ఆసరా లబ్ధిదారులు, తెల్లరేషన్‌ కార్డుదారుల ఆకలి తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు ఎవరూ ఆకలికి బాధపడొద్దని ప్రభుత్వం పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు గత నెల రూ.1,110 కోట్లు ఖర్చు చేసింది. తెల్లకార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి రూ.1,500 చొప్పున 87.54 లక్షల కుటుంబాలకు ఈ నెలలో మొత్తం రూ.1,300 కోట్లను పంపిణీ చేసింది. వచ్చే మే నెలలో సైతం పేదలకు ఇలానే బియ్యం, నగదు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.  

అప్పులు దొరికితేనే రాష్ట్రం కడుపు నిండేది..  
లాక్‌డౌన్‌ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శక్తి పూర్తిగా క్షీణించింది. ఒకవైపు ఆదాయం పూర్తిగా బంద్‌ కాగా, అప్పులు చేసి రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకా>రం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ) విలువలో ఏడాదికి 3.5 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే డిసెంబర్‌ నాటికి ప్రభుత్వం రూ.15,051 కోట్ల అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ఏర్పడిన ఆదాయ లోటును అధిగమించేందుకు ప్రస్తుత ఏప్రిల్‌ నెలలోనే బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.4 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించింది.

వచ్చే డిసెంబర్‌ నాటికి మరో రూ.11,051 కోట్ల రుణాలను మాత్రమే ప్రభుత్వం సమీకరించుకోవడానికి వీలుంది. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేసినా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టనుంది. అప్పటివరకు ప్రభుత్వ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం అదనపు అప్పులు చేయక తప్పదని చర్చ జరుగుతోంది. అందుకే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 3.5 శాతం నుంచి 5 లేదా 6 శాతానికి పెంచాలని సీం కేసీఆర్‌ కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. 

రూ.63వేల కోట్ల నష్టం 
లాక్‌డౌన్‌తో గత 40 రోజుల్లో రాష్ట్రంలోని పరిశ్రమలు, వ్యాపార, వ్యాణిజ్య రంగాలకు రూ.63వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర సామాజిక ఆర్థిక గణన నివేదిక ప్రకారం.. 2019–20లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.6,63,258 కోట్లు (స్థిర ధరల వద్ద).. అంటే ఆ ఏడాది రాష్ట్రంలో ఆ మేరకు విలువ చేసే వస్తువులు, సేవల ఉత్పత్తి జరిగిందని అర్థం. గతేడాది తరహాలోనే 2020–21లో సైతం రాష్ట్రం 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని భావించినా, మొత్తం రూ.7,16,318 కోట్ల జీఎస్డీపీ సాధించాల్సి ఉంది. అంటే గడిచిన 40 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో ఉత్పత్తి కావాల్సిన వస్తు, సేవల విలువ రూ.79,590 కోట్లు కానుంది. ఇందులో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలదే. లాక్‌డౌన్లో వ్యవసాయ, అనుబంధ రంగాలు యథాతథంగా పనిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను మినహాయిస్తే లాక్‌డౌన్‌ వల్ల గత 40 రోజుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.63,672 కోట్ల నష్టం జరిగిందని చెప్పొచ్చు. మైనింగ్, తయారీ, నిర్మాణ రంగం, వాణిజ్యం, రిపేర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, రైల్వేలు, విమానయానం, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి తదితర రంగాలకు ఈ మేరకు నష్టం జరిగింది. 2020–21కి సంబంధించిన జీఎస్డీపీ వృద్ధి రేటు భారీగా పతనం కావడానికి ఇది కారణం కానుంది. ఈ నేపథ్యంలో మే 7 తర్వాత రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని పారిశ్రామిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.  

ఉద్యోగాలు ఉంటాయా? 
లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వ్యాపారాలు మూతబడటంతో ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనని తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ తాత్కాలిక ఉద్యోగులను పనిలో నుంచి తీసేశాయి. రెగ్యులర్‌ ఉద్యోగులకు సైతం చాలా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు జీతాలు చెల్లించట్లేదు. రాష్ట్రంలోని 1500 ఐటీ, అనుబంధ రంగ సంస్థల్లో 5.40 లక్షల మంది పని చేస్తున్నారు. 1,63,302 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో 9,80,520 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. చదవండి: గుడుంబాపై ఉక్కుపాదం మోపండి

2,493 భారీ పరిశ్రమల్లో మరో 9,65,050 మంది ఉద్యోగులున్నారు. లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడడంతో వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. ఐటీ రంగ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయని వార్తలు వస్తుండడంతో ఆయా ఉద్యోగుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో పాటు శ్రామిక, ఉద్యోగ లోకం ఆతృతతో ఎదురుచూస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement