సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి యువతపై పంజా విసురుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో నమోదైన కేసులను విశ్లేషిస్తే.. కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో యువకులు, నడివయస్కులే అధికంగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో వృద్ధులు, చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగా.. మన హైదరాబాద్‌లో మాత్రం అన్ని వయసుల వారిపైనా ఆ ప్రభావం ఉంది. ఈ నెల 19వ తేదీ నాటికీ హైదరాబాద్ నగరంలో 395 మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అధికంగా 76 మంది 21 నుంచి 30 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అదేవిధంగా 20 ఏళ్ల లోపు వయసున్న వారు 106 మంది ఉన్నారు. ఆ తర్వాత మధ్య వయస్కులపై ఈ రక్కసి ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన అనంతరం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసుల్లో 80% నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి తో సన్నిహితంగా మెలిగినవారే ఉన్నారు.
దడ పుట్టిస్తున్న పాతబస్తీ...
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదైన కేసుల్లో అధిక భాగం పాతనగరం (ఓల్డ్ సిటీ)వే కావడం అధికార యంత్రాంగాన్ని, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సౌత్‌జోన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను సైతం పెంచుతూ వస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 395 కేసులుండగా.. ఇందులో సౌత్‌జోన్‌లో 167 కేసులున్నాయి. అలాగే సౌత్‌జోన్‌తో అనుబంధంగా ఉండి.. ఎక్కువ రాకపోకలు జరిగే వెస్ట్ జోన్‌లో కూడా కేసుల సంఖ్య 138గా నమోదైంది. ఈ జోన్లలో సోమవారం నాటికీ 51 ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్ల పరిధిలోకి వచ్చే ఇళ్లను జల్లెడ పడుతూ కరోనా లక్షణాలతో పాటు జలుబు, జ్వరం వస్తున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు వేగిరం చేసింది. మరోవైపు ప్రతి పౌరుడికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా ఇప్పటికే కరోనా వచ్చిన వారి నుంచి ఇంకెంతమందికి ఈ వైరస్ సోకిందో తేలుస్తోంది.
యువతపై కరోనా పంజా!
Published Wed, Apr 22 2020 1:46 AM | Last Updated on Wed, Apr 22 2020 4:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment