సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ మరింత ఉధృతంగా విస్తరిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున 20 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా....తాజాగా సోమవారం ఏకంగా 79 కేసులు నమోదు కావడంతో గ్రేటర్‌వాసుల్లో మరింత ఆందోళన మొదలైంది. లాక్‌డౌన్‌తో కేసుల సంఖ్య తగ్గుతుందని అంతా భావించినప్పటికీ..వైరస్ తీవ్రత తగ్గక పోగా మరింత విజృంభిస్తుండటం గ్రేటర్ వాసులను కలకవర పెడుతోంది.(జిల్లాల్లో కరోనా ‘సెరో సర్వే’)
మలక్‌పేట్‌లో..
చాదర్‌ఘాట్: ఓల్డ్ మలక్‌పేట డివిజన్ లోని రేస్‌కోర్స్ రోడ్ లైన్ లోని సాధన అపార్ట్‌మెంట్‌లో రెండు రోజుల క్రితం ఓ వృద్ధురాలికి (65) కరోనా పాజిటివ్ రాగా, సోమవారం ఆమె భర్తకు (70), కోడలు (35) లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్బర్‌బాగ్ డివిజన్ పల్టాన్‌కు చెందిన వ్యక్తికి (55)కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం అతడి కుమారుడికి కూడా (21) పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంగళరావునగర్ డివిజన్ జవహర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి(43) కరోనా పాజిటివ్ వచ్చింది. (హైదరాబాద్‌కు చేరుకున్న‘వందేభారత్’ ఫ్లైట్)
రాజీవ్‌గాంధీనగర్‌లో మరో ముగ్గురికి
మోతీనగర్: అల్లాపూర్ డివిజన్ రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ హమాలితో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. అయితే అతడి కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న మరో ముగ్గురికి పాజిటివ్ రావడంతో అధికారులు సోమవారం వారిని ఆసుపత్రికి తరలించారు.
కిషన్‌బాగ్‌లో నాలుగు...
బహదూర్‌పురా: కిషన్‌బాగ్ డివిజన్, కొండారెడ్డిగూడలో సోమవారం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ పరిధిలో 13 మంది ...
వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం 40 మంది పరీక్షల నిమిత్తం ఆయుర్వేద ఆసుపత్రికి రాగా వారికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మరో 80 మంది అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించినట్లు నోడల్ అధికారులు తెలిపారు. కాగా ఛాతీ ఆసుపత్రిలో సోమవారం పాజిటివ్ కేసు ఒకటి నమోదు కాగా, మరో 13 మంది ఐసోలేషన్ వార్డులో ఉన్నట్లు సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ తెలిపారు.
విజయా డయాగ్నస్టిక్ సెంటర్ ఉద్యోగినికి పాజిటివ్
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఎస్డీరోడ్‌లోని విజయడయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేసే ఓ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం సాయంత్రం సదరు డయాగ్నస్టిక్ కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు ఉద్యోగులను క్వారంటైన్‌కు తరలించారు. వివరాల్లో వెళితే..సికింద్రాబాద్ విజయ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఓ మహిళ రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. మలక్‌పేట్‌లోని గంజ్‌లో పని చేస్తున్న ఈమె తల్లికి పాజిటివ్ రావడంతో అధికారులు సదరు ఉద్యోగినికి కూడా పరీక్షలు నిర్వహించడంతో సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న 12 మంది ఉద్యోగులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం డయాగ్నస్టిక్ కేంద్రాన్ని సీజ్ చేశారు. అవసరమైతే ఆయా ఉద్యోగుల కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
జియాగూడలో 25 పాజిటివ్ కేసులు
జియాగూడ: జియాగూడ డివిజన్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నానాటికి పెరుగుతున్న కరోనా పాజిటివ్‌లతో ఆయా బస్తీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్ కేసులు నమోదు కావడమేగాక ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో గోషామహాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ శంకర్ పోలీసులు సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. రద్దీగా ఉన్న జియాగూడ, మేకలమండి, సబ్జిమండి కూరగాయల మార్కెట్లు, దుకాణాలను మూసివేయించారు. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. జియాగూడ దుర్గానగర్‌లో 12, వెంకటేశ్వర్‌నగ్‌లో 6, శ్రీసాయినగర్‌లో 5, సంజయ్‌నగర్ 1, ఇందిరానగర్‌లో 1 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాతో వృద్ధుడి మృతి
జియాగూడ దుర్గానగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి (75) కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
కంటైన్మెంట్‌లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని జియాగూడ డివిజన్‌లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు గోషామహాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపారు.
బాధిత కుటుంబ సభ్యులే..
జియాగూడలో కరోనా పాజిటివ్ సోకిన కుటుంబాల నుంచే సోమవారం 25 కరోనా పాజిటివ్ కేసులు న మోదు కావడం గమనార్హం. గతంలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి నుంచి అతడి కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి సోకినట్లు కుల్సుంపురా ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment