సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణకు రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు సంబంధించిన భవిష్యత్తు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రం ప్రకటిం చిన సడలింపుల్లో ఇప్పటికే రాష్ట్రంలో కొన్నిం టిని అమలు చేస్తున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో నియంత్రిత పద్ధతిలో చాలావరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది.
హైదరాబాద్, రంగారెడ్డి తదితర రెడ్ జోన్ జిల్లాల్లో మాత్రం ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెడ్ జోన్ జిల్లాల్లో కొన్ని సడలింపులకు అనుమతి ఇచ్చే విషయంపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ మినహా ఇతర రెడ్ జోన్ జిల్లాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అక్కడ కొంత వరకు ఆంక్షలు సడలించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల మేరకు ఇతర రాష్ట్రాల్లో చాలా వరకు సడలింపులిచ్చారు.
దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందిందా..? అన్న విషయాన్ని సమీక్షించి రాష్ట్రంలో కూడా సడలింపుల అమలుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రజారవాణా పునరుద్ధరణపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమలు చేయాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. వలస కార్మికులకు సంబంధించిన సమస్యలను సైతం పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ విషయాన్ని సైతం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కరోనా ఇప్పట్లో తగ్గుముఖం పట్టదని, ఈ వైరస్‌తో కలసి బతికేందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో దీనికి సంబంధించిన నివేదికను అధికారులు ప్రభుత్వం ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఈ సమీక్షలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment