సాక్షి, సిటీబ్యూరో: ఆషాఢ బోనాలకు..ఈ యేడు కోవిడ్ రక్కసి అడ్డుపడుతోంది. గడిచిన వందేళ్లలో గతమెన్నడూ లేని రీతిలో సాధారణ భక్తులు కాకుండా అధికారులు, పూజారులతో కూడిన పదకొండ మంది సభ్యుల బృందం నగరంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో షురువయ్యే బోనాలసందడి గోల్కొండ, సికింద్రాబాద్ మహంకాళి, లాల్‌దార్వాజ సింహవాహిని ఉత్సవాలతో ఉధృతమవుతుంది. లక్షలాది మంది భక్తులు స్వయంగా సమర్పించే ఘట్టంతో నగరంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక నగరంలో బోనాలు ముగియగానే శివార్లలోకూడా భారీగా మొదలవుతుంది. బోనాలకు నెల రోజుల ముందే నగరంలో సందడి మొదలు కావాల్సి ఉన్నా.. ఇంకా ఆ దిశగా ఏర్పాట్లు ఏవీ ప్రారంభమే కాలేదు. ఈనెల 23న ఎల్లమ్మ కళ్యాణం, 25న గోల్కొండ జగదాంబిక, జులై 12న ఉజ్జయిని మహంకాళి, 19న లాల్ దర్వాజ సింహవాహినికి బోనాలు సమర్పించాల్సి ఉంది. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో సుమారు 30 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఆయా ఆలయాలకు రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.
పోతురాజులు, శివసత్తుల్లేకుండానే..
బోనాల ఉత్సవంలో పోతురాజులు ఆటలు, శివసత్తుల పూనకాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. ఈ యేడు డప్పులు, డ్యాన్సులు, పోతురాజులు, శివసత్తులు, పలహారం బండ్లను సైతం అనుమతించే అవకాశం లేదు. కేవలం ఆలయాన్ని బట్టి 11 నుండి 25 మంది వరకు అనుమతించి పూజారుల ఆధ్వర్యంలోనే బోనాలు సమర్పించే దిశగా అధికార యంత్రాంగం ఓ నిర్ణయాకి వచ్చింది. అయితే ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితులను వివరించి ఆలయ కమిటీలు, భక్తుల ఆమోదం తీసుకునే దిశగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శనివారం బల్కంపేట దేవాలయానికి సంబంధించి, ఈనెల 10న నగరంలోని అన్ని దేవాలయాల కమిటీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment