చార్మినార్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఈసారి కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బోనాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు రోజుకో కుటుంబం అమ్మవారికి బోనాలు సమర్పిస్తామంటూ భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ గుంపులు, గుంపులుగా కాకుండా ఒక్కొక్కరు ఆయా బస్తీల్లోని అమ్మవారికి బోనాలను సమర్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేసారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. బోనాల జాతర ఉత్సవాల సందర్బంగా పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గత మూడేళ్లుగా బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్ధిక సహాయంతో పాటు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్సవాల ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తోంది.
నెల రోజుల పాటు రోజు వారీ బోనాలకు సిద్ధం
పాతబస్తీలో నెల రోజుల పాటు రోజు వారీ బోనాల సమర్పణకు స్థానిక ఉత్సవాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో కుటుంబం చొప్పున అమ్మవారికి బోనాలు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దేవాలయాల కమిటీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహించి స్థానిక మహిళా భక్తుల అభిప్రాయాలను సేకరించారు. మహిళా భక్తుల సూచనలు, సలహాల మేరకు ఆషాఢ మాసం ప్రారంభంæ రోజు నుంచి ముగిసే రోజు వరకు రోజు వారి బోనాలు సమర్పిస్తామంటూ చెబుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి తాము అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అమ్మవారికి బోనాలను సమర్పిస్తామంటున్నారు. పాతబస్తీలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటిలో 25 ప్రధాన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాల్లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి. అయితే ఈసారి కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఎలాంటి హంగు,ఆర్బాటాలు లేకుండా సాదాసీదాగా బోనాల జాతర ఉత్సవాలు కొనసాగనున్నాయి.
జాతర వివరాలు...
♦ ఈ నెల 25న గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో ఈసారి ఆషాడ బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 12న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి.
♦ అదే రోజు పాతబస్తీలోని వివిధ అమ్మవారి దేవాలయాల ఘటస్థాపన కొనసాగుతుంది.
♦ జూలై 19న, నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటు చారిత్రాత్మకమైన పాతబస్తీలో బోనాల సమర్పణ ఉంటుంది. మరుసటి రోజు అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాలు జరగాల్సి ఉంది. అయితే 19,20వ తేదీల్లో ఎలాంటి బోనాల సమర్పణ కార్యక్రమాలను నిర్వహించ రాదని ప్రభుత్వం సూచించడంతో ఆయా రోజుల్లో కేవలం పూజారులే పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవు తున్నారు.
నెలంతా బోనం సమర్పిస్తాం
గుంపులు గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ నెల రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో కుటుంబం వారిగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాం. అంటువ్యాధులు(గత్తర్) సోకకుండా నివారణ కోరుతూ తెలంగాణలో నిర్వహించే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్వహిస్తాం...కానీ, పూర్తిగా ఇళ్లకే పరిమితం చేయడం సరైంది కాదనే విషయాన్ని ప్రభుత్వానికి వివరించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తాం. – జె.మధుసూదన్ గౌడ్, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు
ఒక్కొ కుటుంబం చొప్పున బోనం నిరాడంబరంగా సమర్పిస్తాం
రోజుకు ఒక్కో కుటుంబం చొప్పున నెల రోజుల పాటు అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని..ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణఃగా బోనాలను సమర్పిస్తామని ప్రభుత్వాన్ని కోరాం. ఒక్కొక్కరు బోనంను తలపై పెట్టుకుని నిరాడంబరంగా ఆయా బస్తీలోని మహంకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవార్లకు బోనం సమర్పిస్తారు.– గాజుల అంజయ్య, మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం కమిటి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment