
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ఐటీ రంగానికి శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న పలు సంస్థలకు తాము పూర్తి చేయాల్సిన ఒప్పందాలకు సంబంధించిన క్లయింట్లతో సమావేశాలు వాయిదాపడ్డాయి. ఆయా దేశాల్లో తమ కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టుల పూర్తికి పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి తమ సంస్థల టెకీలను ఆయా దేశాలకు పంపించేందుకు బ్రేకులు పడ్డాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో మహానగరం పరిధిలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోంకే పరిమితం చేశాయి. దీంతో ఉత్పాదకత గతంతో పోలిస్తే మోస్తరుగా తగ్గిందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇప్పటికే తమ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయడం మరింత ఆలస్యమవుతాయని పలు సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ అనంతరం దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసి వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన విషయం విదితమే.
అయితే, ప్రస్తుత తరుణంలో ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, జరిగిన నష్టంపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఐటీ రంగానికి కొంగు బంగారంగా నిలిచిన హైదరాబాద్‌లో ఈ రంగం నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ రాకతో ఈ రంగం గణనీయంగా పురోగమిస్తుందని తెలిపారు. కొన్నిరోజుల పాటు అనిశ్చితి నెలకొన్నప్పటికీ త్వరలో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2019–2020 మార్చిలో సుమారు రూ.1.07 లక్షల కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
ఐటీ రంగ సమస్యలివే..
గ్రేటర్ పరిధిలో సుమారు 900 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీల్లో సుమారు వంద వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బహుళజాతి కంపెనీలున్నాయి. ప్రస్తుతం కరోనా కలకలం, లాక్‌డౌన్ నేపథ్యంలో తాము చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు మెజారిటీ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో తమకు మోస్తరుగా నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపాయి. నష్టాలను ఇప్పుడే అంచనా వేయలేమని, ఇందుకు రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంటున్నాయి.
ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు పెరుగుతాయి
‘అమెరికాలో లక్షల మంది మంది ఐటీ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుకావడం, హెచ్1బీ వీసాల రద్దుపై అమెరికా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో.. పలు అమెరికా బహుళ జాతి కంపెనీలు మన నగరంలోని ఐటీ కంపెనీలతో పాటు పలు దేశీయ కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో భారీగా ఐటీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పే అవకాశాలున్నాయి. ఇప్పటికే అమెరికాలో చిన్న కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను భారీగా చేపట్టాయి. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర కంపెనీలదీ ఇదే ప్రక్రియకు శ్రీకారం చుడతాయని ఆశిస్తున్నాం. ఇలా జరిగితే ఇక్కడ ఉపాధి కల్పన మరింత పెరగనుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ రంగం స్వల్ప ఒడిదొడుకులు ఎదుర్కొన్నా ఐటీ రంగం నిలకడ గల వృద్ధిని తప్పక సాధిస్తుంది. ఈ విషయంలో త్వరలో స్పష్టత రానుంది’
– మురళి, హైసియా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment