సాక్షి, సిటీబ్యూరో: కొరోనా లాక్‌డౌన్ ప్రభావంతో స్థిరాస్తి రంగం స్తబ్ధతగా మారింది. కొత్త ఒప్పందాలు పూర్తిగా నిలిచిపోగా, దస్తావేజుల నమోదు పూర్తీగా తగ్గుముఖం పట్టాయి. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ పరిమితం కాగా, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా దస్తావేజుదారుల ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించారు. సాధారణంగా స్థిరాస్తి లావాదేవీలపై ఒప్పందాల అనంతరం రిజిస్ట్రేషన్ల కోసం 30 నుంచి 60 రోజుల వరకు గడువు విధించుకుంటారు. దీని ప్రకారం ముందు జరిగిన ఒప్పందాల్లో కొన్ని దస్తావేజుల నమోదు పూర్తి కాగా మరి కొన్ని కొరోనా లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ లభించక తాత్కాలికంగా వాయిదా పడుతున్నాయి. మరోవైపు స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలూ తాత్కాలికంగా నిలిచిపోయాయి. సాధారణంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆస్తులు కొనుగోలు, అమ్మకందారులు, వారి సంబంధికులు, సాక్షులు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ల కోసం నవదంపతులు, వారి కుటుంబ సభ్యులు తాకిడి అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి వారం కావడంతో దస్తావేజుదారులతో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిట లాడుతాయి. కొరోనా లాక్‌డౌన్ ప్రభావం, పరిమిత స్లాట్ బుకింగ్, దస్తావేజుల దారులపై ఆంక్షలతో వెలవెలబోతున్నాయి.
తగ్గిన రిజిస్ట్రేషన్లు
గ్రేటర్ పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మూడు నుంచి ఐదుకి మించి దస్తావేజుల నమోదు పక్రియ పూర్తి కావడం లేదు. మహా నగర పరిధిలో హెదరాబాద్, హైదరాబాద్ (సౌత్) రంగారెడ్డి, మల్కాజిగిరి రిజిస్ట్రేషన్ జిల్లాలు ఉండగా, వాటి పరిధిలో 41 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పనిచేస్తున్నాయి. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాధారణంగా రోజూ కనీసం 20 నుంచి 60 వరకు, కొన్నింటిలో 80 నుంచి 140 వరకు స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు నమోదు పక్రియ పూర్తవుతోంది. రెండు రోజుల నుంచి కొరోనా లాక్ డౌన్ ప్రభావంతో దస్తావేజుల నమోదు సంఖ్య మూడు నుంచి ఐదు సంఖ్యకు పడిపోయింది. నిరంతరం దస్తావేజుదారులతో కిటకిటలాడే ఉప్పల్, రంగారెడ్డి ఆర్వో, కుత్బుల్లాపూర్ మహేశ్వరం, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, ఇబ్రహీంపట్నం, ఫారూఖ్‌నగర్, వనస్థలిపురం తదితర సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో దస్తావేజులు నమోదు మూడు నుంచి ఐదుకు మించడం లేదు.
స్లాట్ బుకింగ్ తప్పని సరి...
స్థిరాస్తి లావాదేవిల నమోదు కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ తప్పని సరైంది. రిజిస్ట్రేషన్ శాఖ కొరోనా ప్రభావంతో దస్తావేజుల నమోదు కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్‌ను పరిమితం చేసింది. ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజులు మూడు నాలుగు మించి స్లాట్ బుకింగ్‌కు అనుమతి లభించడం లేదు. స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వచ్చే వారికి టోకన్లలో సూచించిన సమయంలోనే లోనికి అనుమతిస్తున్నారు. అది అతి తక్కువ మందికి లోనికి అనుమతి లభిస్తోంది. లావాదేవీలు జరిపిన దస్తావేజుదారులతోపాటు సాక్షులను మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక దస్తావేజు నమోదుకు పది మంది చేతులు మారే అవకాశం ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖ కట్టడిట్టమైన ఆంక్షలు విధించింది. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేతులు కడుక్కున్నాకే అనుమతిస్తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ చేయాల్సిన దస్తావేజును పరిశీలించి లోపలికి ప్రవేశం కల్పిస్తున్నారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ పక్రియలో రెండు పక్షాల వారి సంతకాలు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో వారికి శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టారు.
బంద్ ప్రకటించిన దస్తావేజు లేఖరులు
కొరోనా లాక్‌డౌన్ నేపథ్యలో దస్తావేజు లేఖరులు (ఏజెంట్లు) తమ షాపులను పూర్తీగా మూసేశారు. దీంతో స్థిరాస్తి దస్తావేజుల రూపకల్పన కూడా ఆగిపోయింది. దీంతో స్థిరాస్తి కొనుగోలు అమ్మకందారులు కూడా తమ లావాదేవీలను తాత్కాలింగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు స్థిరాస్తికి సంబంధించిన కొత్త ఒప్పందాలు సైతం నిలిచిపోవడంతో వాటి ప్రభావం వచ్చే నెల వరకు ఉంటుందని స్థిరాస్తి నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment