గడప దాటాలంటే మాస్కు ఉండాల్సిందే! | Coronavirus : Mask Is Compulsory In Telangana | Sakshi
Sakshi News home page

గడప దాటాలంటే మాస్కు ఉండాల్సిందే!

Apr 10 2020 3:23 PM | Updated on Apr 11 2020 1:20 AM

Coronavirus : Mask Is Compulsory In Telangana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇదివరకు కరోనా లక్షణాలు ఉన్నవారు, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడేవారు, రోగులకు సేవలందించే వారు మాత్రమే మాస్కులు ధరించాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. మాస్కులు ధరించే తీరు, జాగ్రత్త చర్యలకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ చేసిన సూచనలు, ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.

అడుగు బయట పెడితే మాస్క్‌..
ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే మాస్క్‌ తప్పనిసరిగా ధరించాల్సిందే. ఇతరులతో మాట్లాడాల్సిన సమయంలోనూ మాస్కు వేసుకోవాల్సిందే. జపాన్‌లో మాస్కుల ధారణతో కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చిందనే అధ్యయనం ఆధారంగా రాష్ట్రంలో కూడా ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు క్రియాశీలకంగా పనిచేస్తాయని అధికారులు భావిస్తున్నారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు రావడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి జరుగుతుంది. అదే మాస్కులు ధరిస్తే ఈ వ్యాప్తికి తగ్గించొచ్చు. మాస్కులు అందుబాటులో లేనప్పుడు చేతి రుమాలును రెండు వరుసలుగా చేసి కట్టుకోవాలి. మాస్క్‌ ధరించడం, భౌతిక ధూరాన్ని పాటించే అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సూచనలు తప్పనిసరి..
– మాస్క్‌ ధారణ విషయంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ పలు రకాల సూచనలు చేసింది. మాస్కు కట్టుకుంటే చెవి, ముక్కు, చెంపలు పూర్తిగా కవర్‌ అయ్యేలా ఉండాలి. ముఖానికి మాస్కుకు మధ్యలో అంతరం ఉండకూడదు. చేతి రుమాలును వినియోగించే వారు రెండు వరుసలుగా మడత పెట్టి ముఖానికి కింది భాగం కవర్‌ అయ్యేలా కట్టుకోవాలి.
– ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవలందించే సంస్థల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో, విధులు నిర్వహించి, ఇంటికి చేరుకునే వరకు కూడా మాస్కులు ధరించాలి.
–  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఈ మాస్కులను ఇంటినుంచి బయట అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ధరించాలి. మాస్క్‌ ధరించడమంటే మెడలో వసుకోకుండా తప్పకుండా ముఖానికి నిర్దేశించినట్లుగా కట్టుకోవాలి.
– మాస్క్‌ పెట్టుకునే ముందు చేతులు శుభ్రంగా సబ్బుతో/ శానిటైజర్‌/ హ్యాండ్‌వాష్‌తో కడుక్కోవాలి. ప్రతిరోజు శుభ్రపర్చిన/ కొత్త మాస్కు ధరించాలి. ఒకసారి వినియోగించిన మాస్కు మరుసటి రోజు అలాగే వాడొద్దు. మాస్కును ఒకరోజు ఒక వైపు, మరో రోజు మరో వైపు పెట్టుకోవద్దు. డిస్పోజబుల్‌ మాస్కులు కాకుండా బట్టతో తయారు చేసిన రీ యూజబుల్‌ మాస్కులు ధరిస్తే మంచిది. డిస్పోజబుల్‌ మాస్కులను ప్రతి ఆరుగంటల తర్వాత తప్పనిసరిగా తొలగించాలి. ముందువైపు పట్టుకోకుండా తొలగించి మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి.
– మాస్న్‌ తొలగించిన వెంటనే శానిటైజర్‌/సబ్బుతో చేతులు శుభ్రపర్చుకోవాలి. రీ యూజబుల్‌ మాస్కులను తొలగించిన వెంటనే సబ్బు నీళ్లు లేదా వేడి నీళ్లు ఉన్న దాంట్లో వేయాలి. అనంతరం దాన్ని సబ్బు లేదా డెటాల్, సావలాన్‌ ద్రావణాలతో వేడి నీళ్లలో 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రపర్చాలి. అనంతరం 5 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. లేదా ఇస్త్రీ పెట్టెతో 5 నిమిషాల పాటు ఆరబెట్టాలి. శుభ్రపర్చిన మాస్కును పొడిగా ఉన్న చోట జాగ్రత్తపర్చాలి.
–  మాస్కును ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ పరిశుభ్రమైన పరిసరాల్లో ఉండాలి. మనిషికి మనిషికి దూరం కనీసం రెండు మీటర్లు ఉండేలా జాగ్రత్తపడాలి. అదేవిధంగా తరచుగా చేతులతో ముఖాన్ని తాకడాన్ని మానుకోవాలి. 


(కరోనా: ‘మర్కజ్‌, నిజాముద్దీన్‌ అని చెప్పొద్దు’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement