సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ సడలింపులతో దాదాపు అన్ని రంగాలపై ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతుండటంతో వైరస్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గత రెండు వారాల్లో వైరస్ ప్రభావం రెట్టింపు అయ్యింది. లాక్‌డౌన్ సమయంలో రోజుకు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు వందకు పైబడి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సర్కారు సైతం ఆందోళన చెందుతోంది. బాధితుల సంఖ్య భారీగా పెరిగితే వారికి చికిత్స ఎలా ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మే నెల 18 నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు భారీగా సడలించారు. అంతకుముందు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలకే అవకాశం ఉండగా.. 18 నుంచి సాధారణ వ్యాపారాలు, రవాణా సౌకర్యం, అంతర్రాష్ట్ర రాకపోకలు.. ఇలా మెజారిటీ రంగాలకు సడలింపులు ఇవ్వగా, ప్రజలు బయటకు రావడం ఒక్కసారిగా పెరిగింది.
ముందు అదుపులో ఉన్నా..
రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదైంది. మార్చి 16 నుంచి విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, హోటళ్లను ప్రభుత్వం మూసేయగా.. మార్చి 22 నుంచి అత్యవసర సేవలందించే సంస్థలకు మినహా అన్ని రంగాలకు లాక్‌డౌన్ ప్రకటించింది. మే 18 వరకు లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో కొనసాగడంతో రాష్ట్రంలో 1,592 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని రంగాలకు సడలింపులు రావడంతో కేసుల సంఖ్య రెట్టింపయింది. బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 3,020 కేసులు నమోదైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రెండున్నర నెలల పాటు నమోదైన కేసులు.. లాక్‌డౌన్ సడలింపులతో రెండు వారాల్లోనే రెట్టింపయ్యాయి. ముఖ్యంగా మే 21 నుంచి కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూ.. ఒక్కో రోజు వందకు పైబడి కేసులు నమోదవుతున్నాయి. వలస కూలీలకు అనుమతివ్వడం, అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతించడంతో రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లోనే రాష్ట్రంలో 1,306 కేసులు నమోదయ్యాయి.
ఎక్కువ కేసులు గ్రేటర్ పరిధిలోనే..
రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. గత రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులు నమోదు కాగా.. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 315 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. రెండు వారాల్లో నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీవే 62 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల్లో నమోదైన కేసుల్లో వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే.. 991 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీలో కేసుల శాతం 81 కావడం గమనార్హం. జనసాంద్రత అధికంగా ఉండటం, భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కేసులు అధికమవుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా తీవ్రత తగ్గినట్లు చాలామంది భావిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment