సాక్షి, ఖమ్మం : జిల్లాకు ఆనుకుని ఉన్న పొరుగు జిల్లా సూర్యాపేటలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు 50 దాటడం, అక్కడి నుంచి కొందరు అధికారులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ వణుకు మొదలైంది. ఇప్పటికే మన వద్ద ఏడు పాజిటివ్ కేసులు ఉన్న విషయం విదితమే. గత నాలుగు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాకపోవడంతో అంతా ఊరట చెందుతున్నారు. ఇకపై కేసులు పెరగకుండా అధికారులు మరింత అప్రమత్తమై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే..సూర్యాపేట ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ఆఫీసులోనే ఖమ్మం నగరానికి చెందిన ఒక అధికారి విధులు నిర్వహిస్తున్నారు. రోజూ ఖమ్మం నుంచి డ్రైవర్‌ను తీసుకుని కారులో మరో అధికారితో కలిసి అక్కడికి వెళ్లి వస్తున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ అని తేలగానే గురువారం రాత్రి..వీరు ముగ్గురు ఖమ్మంలోని కరోనా ఐసోలేషన్ వార్డుకు పరీక్షల కోసం వచ్చారు. శుక్రవారం వారి స్వాబ్ శాంపిళ్లను వరంగల్ ల్యాబ్‌కు పంపగా..నెగెటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరిని 14 రోజుల క్వారంటైన్‌కు తరలించారు. ఆ తర్వాత మరో సారి టెస్టులు చేస్తారు. నగరంలోని పెద్దతండా, మోతీనగర్, ఖమ్మం ఖిల్లా ప్రాంతాల్లో కలిపి మొత్తం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..ప్రభుత్వం కంటైన్‌మెంట్ ప్రాంతాలుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు పేపట్టింది. ఈ క్రమంలో రాకపోకలు సాగించవద్దని, ఇంకా ఇతర ఉద్యోగులెవరైనా ఉంటే..పాటించాలని అంతా కోరుతున్నారు.
ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ప్రజల కనీస అవసరాలకు ఇబ్బంది లేకుండా ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఉభయ జిల్లాల్లో తీసుకున్న చర్యల గురించి శనివారం ఆయన సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఆ వివరాలు మంత్రి మాటల్లోనే ఇలా..
శ్రీరామనవమి స్ఫూర్తితో..
ప్రభుత్వ సూచనలతో, ప్రజల సహకారంతో భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణమహోత్సవాన్ని పరిమిత సంఖ్య భక్తులతో సంప్రదాయబద్ధంగా విజయవంతంగా నిర్వహించాం. ఇదే స్ఫూర్తితో ఉభయ జిల్లాల్లో కరోనా వైరస్ కట్టడికి అధికార యంత్రాంగం నిమగ్నమై చర్యలు తీసుకుంటోంది.
మరో నాలుగు రోజులు ఇలానే ఉంటే..
భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావకపోవడం శుభపరిణామమే. మరో నాలుగు రోజులు ఇలానే ఉంటే భద్రాద్రికొత్తగూడెంలో లాక్‌డౌన్‌ను సడలించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది.
ఖమ్మంలో కట్టుదిట్టం..
ఖమ్మం జిల్లాలో 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరంతా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి నివాస ప్రాంతాల్లోని అనుమానితులను క్వారంటైన్‌కు తరలించాం. ముమ్మరంగా వైద్యపరీక్షలు సాగుతున్నాయి. కటైన్మెంట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు అమలవుతున్నాయి.
అందరినీ ఆదుకుంటాం..
తెల్లరేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాల వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రూ.1500చొప్పున నిరుపేదల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే జమ అయ్యాయి. లాక్‌డౌన్‌తో నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహకారం తోడైంది. ఇది అభినందనీయం. నిత్యావసరాల కొరత అస్సలు రానీయం.
Comments
Please login to add a commentAdd a comment