కరోనా సోకడానికి ఆ సెంటరేనా కారణం? | Coronavirus Spread in Dialysis Center in Hyderabad | Sakshi
Sakshi News home page

వైరస్ @డయాలసిస్‌?

Published Sat, May 16 2020 9:47 AM | Last Updated on Sat, May 16 2020 1:28 PM

Coronavirus Spread in Dialysis Center in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో/హుడాకాంప్లెక్స్‌: మీరు మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారా? డయాలసిస్‌ కోసం ఆస్పత్రులకు వెళ్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త సుమండీ! అసలే రోగ నిరోధకశక్తి తక్కువ.. ఆపై డయాలసిస్‌ కోసం వచ్చిన వారికి కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రోగుల ప్రాణాలు కాపాడాల్సిన సెంటర్లే వారి ప్రాణాలను హరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 1,5000 మంది కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మంది డయాలసిస్‌పై నెట్టుకొస్తున్నారు. డయాలసిస్‌కు వచ్చిన వారిలో ఎవరికి.. ఏ వైరస్‌ ఉందో? గుర్తించడం అక్కడి టెక్నిషియన్లకు కష్టసాధ్యంగా మారింది. డయాలసిస్‌ కోసం వచ్చిన వారిలో కొంత మందికి కరోనా వైరస్‌ సోకడం, వారి నుంచి ఇతర రోగులకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మలక్‌పేట కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రముఖ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకున్న  ముగ్గురు రోగులు సహా వారికి సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు మొత్తం అయిదుగురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరి ద్వారా ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులంతా వైరస్‌ బారిన పడాల్సివచ్చింది. అంతే కాదు చనిపోయిన వారికి కనీసం కర్మకాండలు కూడా చేయలేని దుస్థితి తలెత్తింది. డయాలసిస్‌ సెంటర్ల నిర్వహణ లోపం ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరణకు కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరణాలు.. కేసులు..  
మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సరూర్‌నగర్‌ జింకలబావి కాలనీకి చెందిన ఓ వృద్ధుడు (72) ఇటీవల ఇదే ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మే ఒకటో తేదీన ఆయన మృతి చెందారు. ఈయన ద్వారా ఆయన కుమారుడికి వైరస్‌ సోకింది. డయాలసిస్‌ చేయించుకున్న తర్వాత వైరస్‌ బారిన పడి మృతి చెందిన వ్యక్తికి వైరస్‌ ఎక్కడ? ఎవరి నుంచి? ఎలా? వైరస్‌ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది.  
గడ్డిఅన్నారం తిరుమలానగర్‌కు చెందిన మరో వృద్ధుడు (77) ఇటీవల ఆయన ఇదే కేంద్రంలో డయాలసిస్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందారు. ఆయన ద్వారా ఇంట్లోని తొమ్మిది మందికి వైరస్‌ విస్తరించింది. ఆయన భార్య కూడా మృత్యువాత పడి ంది. భార్యభర్తలిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంభాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అంతే కాదు.. ఆ తర్వాత అదే ఇంట్లో తొమ్మిది మందికి వైరస్‌ సోకి, వారంతా రిస్క్‌లో పడాల్సి వచ్చిది.
వనస్థలిపురానికి చెందిన ఇంకో వృద్ధుడు (75) ఏప్రిల్‌ మూడో వారంలో మలక్‌పేటలోని ఓ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత వైరస్‌ బారిన పడి ఏప్రిల్‌ 29న మృతి చెందారు. అప్పటికే ఆయన పెద్ద కుమారినికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం, ఆ తర్వాత ఆయన ద్వారా ఆయన రెండో కుమారుడి(48)కి రావడం, తండ్రి చనిపోయిన రెండో రోజే ఆయ న కూడా చనిపోవడంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. భార్య, ఇద్దరు కోడళ్లు సహా కుమార్తె, అల్లుడు, నలుగురు మనవళ్లు, ఇద్దరు మనవరాళ్లు, చిన్న కోడలి తల్లి, ఆమె కొడుకు, కోడలు, ఇద్ద రు మనవళ్లు, ఇంటి పనిమనిషి, కారు డ్రైవర్‌ ఇలా మొత్తం 25 మంది రిస్క్‌లో పడాల్సి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement