సాక్షి, హైదరాబాద్: వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రాష్ట్రాలను ఆదేశించింది. రెడ్‌జోన్ జిల్లాలు సహా ఇతర జిల్లాల్లోని కంటైన్మెంట్ ప్రాంతాలు, అలాగే వలస వచ్చి అక్కడక్కడ షెడ్డుల్లోనూ, గుంపులుగా నివసించే చోట్ల గల గర్భిణులకు ప్రసవానికి ఐదు రోజుల ముందు తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. వారిని సమీప ఆస్పత్రులకు తీసుకొచ్చాక 5 రోజుల ముందే శాంపిళ్లను తీసుకెళ్లి నిర్ణీత ల్యాబుల్లో పరీక్షలు చేయాలని పేర్కొంది. వారిని ల్యాబ్‌లకు తరలించి పరీక్షలు చేయొద్దని సూచించింది. ఐసీఎంఆర్ సూచనలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లోని గర్భిణుల వివరాలను సేకరించి వారి తేదీల ప్రకారం ముందే ఆస్పత్రులకు తీసుకురావాలని ఆదేశించింది.
మేలో 50,978 మందికి ప్రసవ తేదీలు
లాక్‌డౌన్ సమయంలోనే సీఎం కేసీఆర్.. ప్రసవ తేదీల ఆధారంగా గర్భిణులను సకాలంలో ఆసుపత్రులకు తరలించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించడం తెలిసిందే. కేసీఆర్ కిట్స్ పథకాన్ని ఆధారంగా చేసుకుని ఏప్రిల్, మే నెలల్లో ఎంతమందికి ప్రసవం కానుందో లెక్కలు తీస్తున్నారు. 45,489 మందికి ఏప్రిల్‌లో డెలివరీ అయినట్టు అధికారులు తెలిపారు. మేలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 50,978 మందికి ప్రసవ తేదీలు ఇచ్చారు. వారిలో తాజాగా కేంద్రం ప్రకటించిన 6 రెడ్‌జోన్ జిల్లాల్లోనే 21,127 మంది ఉన్నారు. వారిలో బీపీ, షుగర్ సహా ఇతరత్రా అనారోగ్య సమస్యలుండి హైరిస్క్‌లో ఉన్న గర్భిణులు 3,869 మంది ఉన్నారు. ఇక, హైదరాబాద్‌లో ప్రసవ తేదీ ఈ నెలలో ఉన్న మహిళలు 5,544 మంది ఉన్నారు. వారిలో 425 మంది హైరిస్క్‌లో ఉన్నారు. కరోనా కేసులు ఇక్కడే అత్యధికం గా నమోదు కావడంతో ఇక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చ ల్, వికారాబాద్, వరంగల్ అర్బన్‌లోని కంటైన్మెంట్ ప్రాంతాలు, వలస కార్మికులున్న ప్రాంతాల్లోని గర్భిణులపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► ప్రొటోకాల్ ప్రకారం వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పీపీఈ కిట్లు ధరించి గర్భిణులకు ప్రత్యేకంగా చికిత్స చేయాలి.
► గర్భిణుల రక్షణకు ఫేస్ మాస్క్‌లు ఇవ్వాలి.
► గర్భిణుల్లో కరోనా తీవ్రత తెలుసుకునేం దుకు ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేయాలి.
► ఆక్సిజన్ థెరపీ చేయాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వాలి.
► ద్రవాహారాలు, ఇతరత్రా సూచించిన పద్ధతిలో ఆహారం అందివ్వాలి.
► గర్భిణుల శరీరం వైద్యపరంగా సహకరిస్తేనే ఆక్సిజన్ థెరపీ, యాంటీ వైరల్ చికిత్స అందిస్తూ సిజేరియన్ చేయాలి.
► సరైన బయో–వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్‌ను అనుసరించాలి.
► వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి పీపీఈ కిట్లు ఇచ్చి లోనికి అనుమతించాలి.
► కరోనా పాజిటివ్ మహిళకు పుట్టిన బిడ్డను పక్క గదిలో ఉంచాలి. సాధ్యం కాకపోతే కనీసం 2మీటర్ల దూరంలో ఉంచాలి.
► తల్లి బిడ్డకు పాలిచ్చేటప్పుడు శ్వాసకోశ పరిశుభ్రత పాటించాలి. బిడ్డను తాకడానికి ముందు, తర్వాత చేతులు కడుక్కోవాలి.
Comments
Please login to add a commentAdd a comment