హాస్టళ్లలో అవినీతి | corruption in Hostels | Sakshi
Sakshi News home page

హాస్టళ్లలో అవినీతి

Published Sat, Aug 2 2014 3:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM

హాస్టళ్లలో అవినీతి - Sakshi

హాస్టళ్లలో అవినీతి

నిజామాబాద్ క్రైం : విద్యార్థుల సొమ్మును వార్డెన్లు నొక్కేస్తున్నారు. సరుకులు కొనుగో లు చేయకుండానే బిల్లులు చూపి నిధులు కాజేస్తున్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించకుండానే మెనూ అమలు చేశామని లెక్కలు చూపి డబ్బులు మింగేస్తున్నారు. బోధన్‌లోని బీసీ, ఎస్సీ హాస్టళ్ల లో ఈ వ్యవహారాన్ని ఏసీబీ బట్టబయలు చేసింది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
తమకు అందిన ఫిర్యాదు మేరకు హాస్టళ్లపై దాడి చేసి వివరాలు సేకరించామన్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోధన్‌లోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ రచన కుమారి హాస్టల్‌కు అవసరమయ్యే సరుకులను బోధన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ సిద్ధివినాయక కిరాణ జనరల్ స్టోర్స్‌లో కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారు చేశారు. కిరాణ దుకాణం స్టాంప్‌ను తయారు చేసుకున్నారు.
 
సరుకుల కొనుగోలు రిజిస్టర్‌లో స్టాంప్ వేసి కిరాణ దుకాణం యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రతి నెలా బిల్లులు తయారు చేసి పంపేవారు. షాప్ పేరుపై డీడీ వచ్చేది. దానిని కిరాణ దుకాణం యజమాని తన ఖాతాలో జమ చేసుకొని, ఒకశాతం కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బులను వార్డెన్‌కు ఇచ్చేవారు. హాస్టల్ వార్డెన్ భర్త తాళ్లపల్లి దేవన్‌కుమార్‌గౌడ్ కిరాణ షాపు యజమాని నుంచి ప్రతినెల బిల్లులు తీసుకువెళ్లేవారు. ఇలా తొమ్మిది నెలల్లో రూ. 2 లక్షల 4 వేల బిల్లులు డ్రా చేశారు.
 
మరోవైపు హాస్టల్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టేవారు కాదు. అడిగినంత భోజనం పెట్టకపోవడం, భోజనంలో కోడిగుడ్డు ఇవ్వకపోవడం చేసేవారు. విద్యార్థుల హాజరు లేకున్నా.. విద్యార్థులు అందరూ హాజరైనట్లు నకిలీ సంతకాలు చేసేవారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. వాచ్‌మన్ శ్రీపతి నిత్యం మద్యం సేవిస్తారు. అలాగే హాస్టల్‌కు వచ్చేవారు.

శుక్రవారం తాము హాస్టల్‌కు వెళ్లే ఒక గంట ముందు నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేసిన ఇద్దరు విద్యార్థులను చెప్పులతో కొట్టారని, ఈ విషయమై వారు తమకు ఫిర్యాదు చేశారని డీఎస్పీ సంజీవ్‌రావు తెలిపారు. వాచ్‌మన్‌కు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా ఆయన మద్యం సేవించి ఉన్నట్లు రిపోర్టు వచ్చిందన్నారు.
 
బీసీ హాస్టల్‌లో..
బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్ వార్డెన్ ముత్యాల చంద్రశేఖర్ సిద్ధివినాయక కిరాణ, జనరల్ స్టోర్స్ నుంచి ఏకంగా బిల్లు బుక్కే తీసుకువెళ్లాడు. ముందుగా తాను హాస్టల్ విద్యార్థుల భోజనానికి కావాల్సిన సరుకులను సొంత డబ్బులతో కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టేవాడు. ఆ బిల్లుల ఆధారంగా వార్డెన్ చేతికే డబ్బులు వచ్చేవి. ఇలా ముత్యాల చంద్రశేఖర్ రూ. లక్షా 57 వేలు కాజేశాడని ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు తెలిపారు.

తాము హాస్టల్‌ను తనిఖీ చేసిన రోజు 106 మంది విద్యార్థులకుగాను 75 మందే ఉన్నారని పేర్కొన్నారు. అయితే వంద మంది విద్యార్థులు హాజరైనట్లు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టారన్నారు. ఇలా గైర్హాజరైన విద్యార్థుల తాలూకు భోజనం బిల్లులనూ వార్డెన్లు నొక్కేస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు.
 
మెస్ కమిటీ అంటే తెలియదు
ప్రతి హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థులతో కూడిన మెస్ కమిటీ ఉండాలి. ఈ కమిటీ హాస్టల్ విద్యార్థులకు వండి, వడ్డించే ఆహార పదార్థాలు, సరుకులను నిత్యం పరిశీలించాలి. అయితే బోధన్‌లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లలో మెస్ కమిటీలే లేకపోవటం విడ్డూరంగా ఉందని డీఎస్పీ సంజీవ్‌రావు పేర్కొన్నారు. మెస్ కమిటీ గురించి విద్యార్థులను అడిగామని, అలాంటి కమిటీ గురించి తమకు తెలియదని వారు పేర్కొన్నారని తెలిపారు.

ప్రతి నెల హాస్టల్‌ను సందర్శించే జిల్లా ఉన్నతాధికారులు సైతం హాస్టల్‌లో అంతా బాగానే ఉందని రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్తుండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ హాస్టళ్ల వార్డెన్లపై కేసులు నమోదు చేశామని, వారి అవినీతిపై జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement