
మిల్లింగ్ మాయ
► కస్టమ్ మిల్లింగ్ పేరిట సర్కారుకు టోకరా
► కరెంట్ లేని మిల్లుకు ధాన్యం కేటాయింపు
► మర ఆడించకుండానే అమ్ముకున్న యజమాని
► పీడీఎస్ బియ్యంరీసైక్లింగ్.. సీఎంఆర్‌గా అప్పగింత
► రూ.1.33 కోట్ల లాభార్జన
► ఫిర్యాదు అందినా మొక్కుబడిగా విచారణ
► రూ.50 లక్షలు చేతులు మారిన వైనం..
ముకరంపుర : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) వ్యవహారంలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోతోంది. అదే వరుసలో తాజాగా మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పౌరసరఫరాల శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్ లేని రైస్‌మిల్లుకు ధాన్యం అప్పగించారు. దీంతో సదరు మిల్లు నిర్వాహకుడు అంతే తెలివిగా వ్యవహరించాడు. సర్కారు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రరుుంచాడు. దొంగచాటుగా పీడీఎస్ బియ్యూన్నే తక్కువ ధరకు సేకరించి తిరిగి సీఎమ్మార్ కింద అప్పగించాడు. తద్వారా దాదాపు రూ.1.33 కోట్ల దాకా లాభపడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందగా ఇటీవల సదరు మిల్లులో సివిల్ సప్లై, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. బేరం కుదరడంతో మొక్కుబడిగా నివేదికలతో మమ అనిపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
17వేల క్వింటాళ్ల ధాన్యం అప్పగింత
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం పౌరసరఫరాల శాఖ అధికారులు జగిత్యాల మండలం మందపల్లిలోని సురభి రైస్‌మిల్లుకు అప్పగించారు. 170 లారీలు అంటే 1700 క్వింటాళ్ల ధాన్యాన్ని గతేడాది నవంబర్‌లో కేటాయించారు. ధాన్యాన్ని మరపట్టించి కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. క్వింటాలు ధాన్యాన్ని మరపట్టించి 67 కిలోల బియ్యంగా ఇస్తే ప్రభుత్వం మిల్లింగ్ చార్జీ కింద రూ.30 చెల్లిస్తుంది.
కానీ మిల్లు నిర్వాహకుడు సదరు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాలుకు రూ.1400, ఆపైన విక్రయించి రూ.2.46 కోట్లు సొమ్ము చేసుకున్నాడు. కేటాయించిన 170 లారీల ధాన్యాన్ని మరపట్టించి 113 లారీలు అంటే 13వేల క్వింటాళ్ల బియ్యూన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం రైస్‌మిల్లర్ పీడీఎస్ బియ్యంతోపాటు ఇతర మిల్లుల్లో ముక్కిపోయిన, రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని కిలో రూ.8 నుంచి రూ.10 చొప్పున రూ.1.13 కోట్లతో సేకరించి పౌరసరఫరాల సంస్థకు అప్పజెప్పడం విశేషం. మిల్లింగ్ చార్జీలు అదనంగా ప్రభుత్వం రూ.5లక్షలు చెల్లిస్తుంది. ఇలా మొత్తంగా రూ.1.18 కోట్ల కుంభకోణం జరిగింది.
అందరి అండదండలతోనే...
సురభి రైస్‌మిల్లుకు గత మూడేళ్లుగా సీజన్లలో రైతుల నుంచి ఐకేపీ సేకరించిన ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అధికార నేతలు, రాష్ట్రస్థాయిలో ఓ ఉన్నతాధికారి, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం ముఖ్య నాయకులు, జిల్లా పౌరసరఫరాల, విజిలెన్స్ అధికారుల అండదండలతో ఈ దందా సాగుతోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆ మిల్లుకు కరెంట్ లేకున్నా... నవంబర్‌లో ధాన్యాన్ని కేటాయించారు. కరెంట్ లేకుండా, దాదాపుగా బంద్ అరుున మిల్లుకు ధాన్యాన్ని ఎలా కేటారుుంచారో అధికారులకే తెలియూలి. సాధారణంగా విచారణకు వెళ్లామంటున్న సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు ఇచ్చిన నివేదిక చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
సురభి రైస్‌మిల్లుకు కరెంట్ లేకపోయినప్పటికీ వేరే మిల్లులో ధాన్యాన్ని మరపట్టించి సీఎంఆర్ అప్పగించారంటూ నివేదిక ఇచ్చారు. కానీ ఏ మిల్లుకు ధాన్యం కేటాయించారో అదే మిల్లులో మర ఆడించి సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర మిల్లులు తాము ఇవ్వాల్సిన సీఎమ్మార్‌నే ఇంత వరకు పూర్తిస్థారుులో అప్పగించలేదు. ఇక మరో మిల్లుకు కేటారుుంచిన ధాన్యాన్ని మరపట్టి ఇచ్చేంత సమయం ఎక్కడుందో అధికారులే చెప్పాలి. రైస్‌మిల్లర్ల సంఘం నేతతోపాటు అధికారులు అండదండలతోనే సదరు మిల్లుకు ధాన్యం కేటారుుంచినట్లు ఆరోపణలున్నారుు. అలాగే ఈ అక్రమ వ్యవహారంపై విచారణలో రూ.50 లక్షల దాకా చేతులు మారినట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం : డీఎస్‌వో నాగేశ్వర్‌రావు
సురభి రైస్‌మిల్లుకు కరెంట్ లేక మిల్లు నడవడం లేదనే ఫిర్యాదు మేరకు విచారణ చేసిన విషయం వాస్తవమే. సదరు మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని వేరే మిల్లులో మర ఆడించి సీఎమ్మార్ అప్పగించారని నివేదిక అందింది. అధికారులను తప్పుదోవ పట్టించినందుకు మిల్లు యజమానికి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నాం. అనంతరం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.