సెంచరీ దాటిన సస్పెన్షన్లు
► పోలీసు శాఖలో అవినీతి అధికారుల బాగోతం
► ఇప్పటి వరకు 115 మంది అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ పోలీస్ శాఖలో తిష్ట వేసిన పాత జాడ్యం వీడడంలేదు. ముఖ్యంగా అవినీతిని అరికట్టేం దుకు, విధి నిర్వహణలో నిర్లిప్తతపై ఉన్నతాధి కారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 115 మంది అధికారులపై వేటు వేశారు కొంత మంది అవినీతితో సస్పెండ్ అయితే, మరికొంత మంది లైంగిక వేధింపులు, ఇంకొంత మంది నిర్లక్ష్యపు నీడలో పనిచేసి వేటుకు గురయ్యారు.ప్రత్యేక రాష్ట్రంలో పోలీస్ శాఖకు కల్పించిన సదుపాయాలు ఏ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చలేదు.
వందల కోట్లు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కల్గిన వాహనాలు, నూతన పోలీస్‌స్టేషన్లు, ప్రత్యేక అలవెన్స్.. ఇలా అనేకం సమకూర్చింది. అయినా కొందరు అధికారులు లంచాలు తీసుకొని ఏసీబీ దొరకడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టడం, భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి కేసుల్లో 10 మంది డీఎస్పీలపై గడిచిన మూడేళ్లలో డీజీపీ అనురాగ్ శర్మ వేటు వేశారు. రాష్ట్రంలోని రెండు జోన్లలో(వరంగల్, హైదరాబాద్) పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ల వ్యవహారమైతే మరీ దారుణంగా ఉంది.
ఒకరు కాదు ఇద్దరు ఏకంగా వీరి సంఖ్య సెంచరీ దాటిపోయింది. అవినీతి, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, కస్టోడియల్ డెత్, తదితర వ్యవహారాల్లో రెండు విభాగాలు కలిపి 103 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కాస్త తక్కువగానే ఉన్నా, హైదరాబాద్, వరంగల్ జోన్లలో ఈ అధికారుల లెక్క దారుణంగా ఉంది.
⇒ వరంగల్ రేంజ్‌లో 2014, జూన్ 2 నుంచి సస్పెండైన ఇన్‌స్పెక్టర్ల సంఖ్య– 13, సబ్‌ఇన్‌స్పెక్టర్ల సంఖ్య 24. æ హైదరాబాద్ రేంజ్‌లో 14 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. æ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 14 మంది ఎస్‌ఐలు సస్పెండయ్యారు. æ సైబరాబాద్ పరిధిలో గడిచిన మూడేళ్లలో 8 మంది ఇన్‌స్పెక్టర్లు, 18 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు వేటుకు గురయ్యారు. æ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏడాది కాలంలో 3 ఇన్‌స్పెక్టర్లు, 7 సబ్‌ఇన్‌స్పెక్టర్లు సస్పెండ్ అయ్యారు.
వేటు తప్పదు: డీజీపీ అనురాగ్ శర్మ
అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఏ అధికారి పనైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా మని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి సస్పెన్షన్ వేటు వేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి, అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.