కీలక సెక్షన్ల కోసం కుమ్ములాట
ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు
విభేదాలతో బజారుకెక్కుతున్న ఖజానా శాఖ
సామాజిక వర్గాలుగా విడిపోయిన వైనం
కరీంనగర్/ముకరంపుర: కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో కుర్చీలాట తారాస్థాయికి చేరింది. ఉద్యోగుల మధ్య ఆధిపత్యపోరు, అవినీతి ఆరోపణలు ఆ శాఖను బజారుకీడుస్తున్నాయి. కీలక సెక్షన్లలో తమ వర్గానికి చెందిన ఉద్యోగులే కూర్చోవాలనే పట్టుదలతో ఉన్న కొందరు నాయకులు ఈ గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. ఒకరిద్దరు నాయకులైతే ఏకంగా కులం కార్డును కూడా ప్రయోగిస్తుండటంతో ఖజానా శాఖ ఉన్నతాధికారు లు బెంబేలెత్తిపోతున్నారు. ఉన్నతాధికారి మెతకతనంవల్లే ఇదంతా జరుగుతోందని కొందరు ఉద్యోగులు ఆరోపిస్తుంటే... ఒక సామాజికవర్గానికే సదరు ఉన్నతాధికారి వత్తాసు పలుకుతూ తమను పక్కనపెడుతున్నారంటూ మరో సామాజికవర్గ ఉద్యోగులు రుసరుసలాడుతున్నారు.
తాజాగా సెక్షన్ల మార్పు వ్యవహారం రెండు ఉద్యోగ సంఘాల మధ్య మరింత చిచ్చురేపింది. ఇరువర్గాల ఉద్యోగులు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లారు. ఉద్యోగుల మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుతో బెంబేలెత్తిపోయిన ఉన్నతాధికారి తాను ఇక్కడ పనిచేయలేనంటూ కలెక్టర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం.
తప్పులను సరిదిద్దాల్సిందిపోయి...
ఖజానా శాఖలో ఓ అధికారి పొరపాటు కారణంగా రూ.4.95 కోట్ల స్కాలర్‌షిప్ సొమ్ము అదనంగా ఖాతాల్లో జమ చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు సొమ్ము రికవరీకి నానాపాట్లు పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ నీతూప్రసాద్ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సూచించారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై ఆ శాఖ డెరైక్టర్ భీమారెడ్డి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్కుల చెల్లింపులకు సంబంధించి అథరైజర్-1గా డీడీ, అథరైజర్-2గా ఎస్టీవో ఉండాలని ఆదేశించి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఖజానా శాఖ కార్యాలయంలో రెండేళ్లకుపైగా ఒకే సీటులో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ ఇతర సెక్షన్లకు మార్చాలని ఉప సంచాలకుడు శ్రీనివాస్ నిర్ణయం తీసుకుని గత నెల మూడో వారంలో సర్క్యులర్ జారీ చేశారు.
ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య ఈ మేరకు ఒప్పుకున్నటు తెలిసింది. అయితే తాజాగా జరిగిన సెక్షన్ల మార్పులో స్కాలర్‌షిప్పు సొమ్ము అదనపు చెల్లిం పుల్లో బాధ్యుడిగా పేర్కొన్న అధికారికి ఆయన కోరుకున్న సీటును కట్టబెట్టారని ఆయన ప్రత్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారి తీరుపై ప్రత్యర్థి ఉద్యోగులు మండిపడుతున్నారు. స్కాలర్‌షిప్ అదనపు చెల్లింపుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కోరుకున్న స్థానాన్ని కట్టబెట్టడమేంటని పేర్కొంటూ సదరు ఉన్నతాధికారిని కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికే బజారునపడ్డ ఖాజానా శాఖ వ్యవహారంపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
పాలనా సౌలభ్యం కోసమే సెక్షన్ల మార్పులు - ట్రెజరీ డీడీ శ్రీనివాస్
పరిపాలనా సౌలభ్యం కోసమే అంతర్గతంగా అధికారుల సెక్షన్లలో మార్పులు చేశాం. సెక్షన్ల మార్పు విషయంలో సామాజికవర్గ కోణం అంశం లేవనెత్తినందున ఎస్‌టీవో మల్లేశంకు పాత సెక్షన్ కేటాయించాం.