సాక్షిప్రతినిధి, నల్లగొండ : రేషన్ సరఫరాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చేపట్టిన సంస్కరణలతో పౌరసరఫరాల శాఖకు మిగులుబాటు కనిపిస్తున్నా అర్హులైన లబ్ధిదారులకు కొత్త కార్డులు దక్కకుండా పోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎప్పుడో మంగళం పాడిన ప్రభుత్వం చివరకు ఆహార భద్రత కార్డులకూ ఎర్రజెండా చూపింది. ఫలితంగా.. రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల జారీ నిలిపివేసి పదినెలలు కావస్తోంది. రేషన్ దుకాణాలు కేంద్రాలుగా జరుగుతున్న అక్రమాలకు బ్రేక్ వేసే ఉద్దేశంతో ఈ–పాస్ (ఎలక్ట్రానికి పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మొదట మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ–పాస్ అమలును మొదలు పెట్టిన సమయంలో అనూహ్యంగా పెరిగిన అదనపు కూపన్ల జారీని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డులు కానీ, కొత్త కూపన్లు జారీ చేయొద్దని నిర్ణయించారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందకుండా అయ్యింది. మొత్త కార్డుల్లో ఇప్పుడున్న యూనిట్ల స్థానంలో కొత్తగా ఎవరినీ చేర్చడం, లేదా తొలగించడం వంటి మార్పులు చేర్పులనూ బంద్ చేశారు.
నల్లగొండ జిల్లా పరిధిలోని 943 రేషన్‌షాపులు, సూర్యాపేట జిల్లాలో 605 షాపులు, యాదాద్రి జిల్లా పరిధిలో 461 రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు అమర్చ డం పూర్తయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినా, కొత్త కార్డుల జా రీ, కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ వంటి అంశాలపై ఎలాంటి నిర్ణయమూ వెలువడకపోవడంతో అర్హులు సరుకులు పొందలేక పోతున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్లే !
జిల్లాలో ఆహార భద్రత కార్డుల సంఖ్య ఎప్పటికప్పటికీ పెరిగిపోవడం వల్లే అసలుకు ఎసరు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ–సేవా కేంద్రాలనుం చి వెళ్లిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చాకే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇక, తహసీల్దార్లు ఆమోదించిన దరఖాస్తులను సివిల్ సప్లయీస్ అధికారులు యధాతధంగా ఆమోదిస్తున్నారు. కొత్త కార్డులకు వస్తున్న దరఖాస్తులు, ఉన్న కార్డుల్లో కొత్తగా పేర్లు జత చేయడంలో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు శాఖా కమిషనర్‌కు వెళ్లడంతోనే కూపన్ల జారీకి బ్రేక్ వేశారని చెబుతున్నారు.
అక్రమాలకు చెక్ ఇలా.. లబ్ధిదారులు దుకాణాలకు వచ్చి వేలిముద్రలు వేస్తేనే, డీలర్లు వారికి సరుకులు పంపిణీ చేస్తారు. కార్డుపై ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైన వేలిముద్రలు వేసి సరుకులు పొందే వీలుంది. ప్రస్తుతం కార్డుదారులు రేషన్‌షాప్‌కు రాకున్నా, సరుకులు తీసుకోకపోయినా వచ్చినట్లు జాబితాలో చూపించి డీలర్లు సరుకులు స్వాహా చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు ఈ–పాస్ విధానంతో చెక్ పడుతుంది. బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు, ఆహారభద్రత కార్డుతో కూడా రేషన్‌కార్డును అనుసంధానం చేస్తారు. దీనిల్ల సరుకులు తీసుకోని లబ్ధిదారులకు సంబంధించిన కోటా అంతా మిగులుగానే డీలర్ల దగ్గర ఉండిపోతుంది. మిగులును బట్టే మరుసటి నెలకు డీలర్లకు సరుకుల కోటాను నిర్ణయిస్తారు.
ఇంకా...ఎదురుచూపులే!
ఈ–పాస్ విధానం మొదట ప్రయోగాత్మకంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేయడం ద్వారా సివిల్ సప్లయీస్ శాఖకు అయిన ఆదాను పరిగణనలోకి తీసుకుని జిల్లాలకు విస్తరించారు. గతేడాది ఏప్రిల్ నుంచి జిల్లాలో ఈ–పాస్ యం త్రాలను రేషన్ షాపుల్లో బిగిస్తున్నారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో 461 రేషన్ దుకాణల్లో ఈ–పాస్ అమల్లోకి వచ్చింది. ఆ జిల్లాలో ఉన్న 2లక్షల పైచిలు కు కార్డుల్లో జనవరిలో లక్షా 80వేల మంది కొనుగోళ్లు జరిపారు. ఒక్క నెలలో ఈ–పాస్ అమలు ద్వారా యాదాద్రి భువనగిరిలో రూ.93లక్షలు ఆదా అయ్యింద ని సమాచారం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకునే నల్లగొండ, సూర్యాపేట జి ల్లాలో ఈ–పాస్ యంత్రాలను అమర్చడం పూర్తి చేశారు. ఫిబ్రవరి ఆఖరుకు ఈ జిల్లాలో జరిగే విక్రయాలను బట్టి ఎంత ఆదా అవుతుందో ఓ నిర్ణయానికి రానున్నారు. ఆ తర్వాతే కొత్త కార్డులు, మార్పులు చేర్పులు, కొత్త కూపన్ల జారీ చేస్తారని అంటున్నారు. దీంతో అర్హులై ఉండి కార్డులు, కూపన్లు లేని వారు మరికొన్ని నెలలు ఎదురుచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment