
కోవిడ్ బాధితురాలితో మాట్లాడుతున్న గాంధీ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ‘గుడి భయపడింది. మసీదు భయపడింది.. చర్చి భయపడింది.. దేశాధినేతలు భయపడుతున్నారు. కానీ ‘మీ కోసం మేం ఆస్పత్రిలో ఉంటాం.. మా కోసం మీరు ఇంట్లో ఉండండి’ అంటూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. మీకేం కాదు.. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు నగరంలోని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో కరోనా నోడల్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, టెక్ని షియన్లు, హౌస్‌కీపింగ్ వర్కర్లు, అంబులెన్స్ సిబ్బంది. ‘వైద్యో నారాయణో హరి’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. మనల్ని మాత్రం ఇళ్లలో ఉండమంటూ.. వాళ్లు మాత్రం ప్రమాదకరమైన వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ రియల్ హీరోలకు.. రీలు హీరోలే కాదు.. సమస్త ప్రజానీకం రెండు చేతులెత్తి హాట్సాఫ్ చెబుతోంది. వైద్యులే నిజమైనదేవుళ్లంటూ చేతులు జోడించి ప్రణమిల్లుతోంది.
ప్రాణాలను లెక్క చేయకుండా..
స్వైన్‌ఫ్లూ.. నిఫా.. ఎబోలా.. తాజాగా కరోనా.. ఇలా కొత్తగా ఏ వైరస్ విస్తరించినా చికిత్సలకు గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులే పెద్దదిక్కు. ఆయా ఆస్పత్రుల్లో ఎన్నో స్పెషాలిటీ విభాగాలు ఉన్నప్పటికీ.. కరోనా చికిత్సల విషయంలో జనరల్ మెడిసిన్, ఫల్మొనాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలదే కీలకపాత్ర. వైద్యులు సహా స్టాఫ్ నర్సులు, టెక్నిషియన్లు, శానిటేషన్, సెక్యురిటీ సిబ్బంది చికిత్సల్లో ముందుంటారు. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వీరంతా తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఆస్పత్రిలో బాధితులకు చికిత్సలు అందించే క్రమంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా వారు కూడా ఆయా రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. గాంధీలో పదేళ్ల క్రితమే స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల బాధితులే కాకుండా.. సరిహద్దు రాష్ట్రాల్లోని బాధితులు కూడా చికిత్స కోసం ఇక్కడికే వస్తుంటారు. ఇలా ఇప్పటి వరకు పదివేల మందికిపైగా ఉచితంగా వైద్యసేవలు అందించారు. మృత్యువుతో పోరాడుతున్న అనేక మందికి ప్రాణాలు పోశారు. ఈ క్రమంలో కొంత మంది వైద్య సిబ్బంది కూడా అనారోగ్యం పాలుకావాల్సి వచ్చింది. అయినా వారు మాత్రం ఇప్పటి వరకు వెనకడుగు వేయలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితులెదురైనా ఏమాత్రం అధైర్యపడకుండా రోగులు, వారి బంధువులకు అండగా నిలుస్తున్నారు.
బాధితుల సేవలో 300మందికిపైగా సిబ్బంది
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం గాంధీలో 40 పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. నల్లకుంట ఫీవర్‌లో మరో 40 పడకలు ఏర్పాటు చేసింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 20, ఉస్మానియాలో 10 పడకలతో కరోనా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 450 మందికిపైగా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇప్పటికే 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మిగిలిన వారికి నెగిటివ్ నిర్ధారణ కావడంతో వారిని ఆ తర్వాత హోం క్వారంటైన్‌కు తరలించారు. గాంధీ ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితులకు సేవలు అందించేందుకు 200 మంది అందుబాటులో ఉన్నారు. వీరంతా మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో 50 మందికిపైగా వైద్య సిబ్బంది వీరిలో సేవలు ఉండగా, ఫీవర్ ఆస్పత్రిలో మరో 50 మందికిపైగా ఉన్నారు. ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ చాలా ప్రమాదమని వీరికి తెలుసు. ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుందని తెలుసు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌తో పోరాడుతున్న బాధితులకు వీరంతా ఎంతో ధైర్యంగా సేవలు అందిస్తున్నారు. వైద్యుల రూపం లో ఉన్న దేవుళ్లుగా ప్రజలచే ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆ విభాగం.. కీలకం..
వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ, కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన బాధితుల కుటుంబాలు, అంతకు ముందు వారికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న బంధువులు, స్నేహితులను గుర్తించడంలో జిల్లా సర్వేలెన్స్ బృందం కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ జిల్లా సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహర్ష నేతృత్వంలోని వైద్య బృందం క్లోజ్ కాంటాక్ట్ ట్రేసింగ్‌లో చూపిస్తున్న చొరవ అభినందనీయం. పాజిటివ్ బాధితుని క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించడం ఒక ఎత్తయితే.. వారి నుంచి మరొకరికి వైరస్ విస్తరించకుండా వారందరినీ నోడల్ కేంద్రాలకు పంపి, వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయించడం మరో ఎత్తు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన తొలి కరోనా పాజిటివ్ బాధితుని నుంచి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో సింహభాగం ఆయన నేతృత్వంలోని వైద్య బృందం ట్రేసవుట్ చేసినవే కావడం గమనార్హం.
చాలెంజ్‌గా తీసుకున్నాం
కోవిడ్ వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజల నుంచి మాత్రం ఆశించిన ఫలితం కనిపించడంలేదు. ఇతర దేశాల నుంచి వచ్చేవారు, లక్షణాలు కలిగినవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలకు హాజరు కావాలి. వైరస్‌ను నియంత్రించి బాధితులకు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి చేసేందుకు కత్తిమీద సాము చేస్తున్నాం. మహేంద్రహిల్స్‌కు చెందిన బాధితునికి స్వస్థత చేకూర్చి డిశ్చార్జి చేయడం కోవిడ్‌పై సాధించిన మొదటి విజయంగా భావిస్తున్నాం.– ప్రొఫెసర్ రాజారావు, జనరల్ మెడిసిన్
ఆగస్ట్ 15న ఘనంగా సత్కరిస్తాం..
గాంధీలో కోవిడ్ ఐసోలేషన్, ఐసీయూల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆర్‌ఎంఓలు, ఇతర సిబ్బంది అందిస్తున్న సేవలు అనన్యమైనవి. సొంత కుటుంబ సభ్యులు, బస్తీ ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా, ప్రాణాపాయమని తెలిసినా చిత్తశుద్ధితో విధులు నిర్వహించడం గొప్ప విషయం. కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఘనంగా సత్కరించి అవార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.– శ్రవణ్‌కుమార్, గా«ంధీ సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment